టీటీడీ స్కంద పుష్కరిణిలో మత మార్పిడులు

టీటీడీ పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పుష్కరిణిలో స్కంధ పుష్కరిణిలో సోమవారం మత మార్పిడుల వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుష్కరిణిలో కొందరిని స్నానం చేయించి మత మార్పిడులకు పాల్పడుతుండగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. 
 
ఈ విషయమై బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాస్టర్‌ ఇమ్మానుయేల్‌, అతని కుటుంబ సభ్యులతోపాటు మరో ఇద్దరు పాస్టర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్వేటి నగరం స్థానిక చర్చి నిర్వాహకులు సోమవారం కొంతమందికి బాప్టిజం ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై కార్వేటి నగరం పోలీసులు మంగళవారం ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 87/2023 మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
 
ఈ సంఘటనపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  టీటీడీ పరిధిలోని కార్వేటినగరం స్కంధ పుష్కరిణిలో మత మార్పిడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
 
స్థానిక స్కంధ పుష్కరిణిని బీజేపీ నేతలు సందర్శించారు. హిందువులకు పవిత్రమైన కార్తిక మాసం తొలి సోమవారం రోజున టీటీడీ అనుబంధ ఆలయమైన వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలోని పుష్కరిణిలో క్రైస్తవ మతానికి చెందిన కొందరు మత మార్పిడులకు పాల్పడడం దారుణమని ధ్వజమెత్తారు.  హిందువులను బలవంతంగా మతమార్పిడి చేసే కార్యక్రమాలు జరగడం అన్యాయమని విమర్శించారు. 

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన అన్యమత ప్రచార, మత మార్పిడి ఘటనపై టీటీడీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనతో హిందూ దేవుళ్ళు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అగౌరపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


స్కంధ పుష్కరణిలో అన్యమత ప్రచారం చేసే వారిపై ఉత్వర్వులు 746, 747 సెక్షన్లపై కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. టీటీడీకి సంబంధించిన ఆలయాల వద్ద ఇలాంటి అన్యమత ప్రచారం చేస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణ వీధిలో వేసిన స్పీడ్‌ బ్రేకర్ల కారణంగా వేణుగోపాలస్వామి ఆలయంలో జరిపే ఉత్సవాలకు తీవ్ర ఆటంకమని అభ్యంతరం వ్యక్తం చేశారు.