టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ

టీటీడీలో ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగుల‌ రెగ్యుల‌రైజేషన్ ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వ జి.ఓ.114 విధివిధానాల‌కు లోబ‌డి జరపాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది.  టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం తిరుమలలో జరిపిన భేటీలో టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వాలని నిర్ణయించారు.
 
శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో ప్రారంభం కానుంది. మొద‌ట కొద్దిమందితో ప్రారంభించి ఆ త‌రువాత విస్తృత స్థాయిలో స్లాట్ల విధానంలో నిర్వ‌హిస్తారు. ఇందుకోసం టికెట్ ధ‌ర రూ.1000/-గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్ర‌త్య‌క్షంగా, వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన‌వ‌చ్చు.
 
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయించే ప్రాంతాలలో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో పాటు రూ.15 కోట్లతో అదనంగా మరో రోడ్డు నిర్మాణానికి అనుమతినిచ్చారు. టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించామని, స్థలాలు సేకరిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 
 
తిరుపతి రాంనగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు రూ.6.15 కోట్లు కేటాయించామని, తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించామని చెప్పారు.
 
శ్రీ‌వారి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల్లో నైవేద్యం, ప్ర‌సాదాలు, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద కేంద్రంలో అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి అవ‌స‌ర‌మైన ప‌ప్పు దినుసులు, చ‌క్కెర‌, మిర‌ప‌కాయ‌లు, నెయ్యి డ‌బ్బాలు నిల్వ ఉంచ‌డానికి తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల మార్కెటింగ్ గోడౌన్ల ప్రాంగ‌ణంలో రూ.11.05 కోట్ల‌తో నూత‌న గోడౌన్ నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదించారు.
 
స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు రూ.197 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. తిరుపతి డీఎఫ్ఓ ఆధ్వర్యంలో రూ.3.50 లక్షలతో నూతన కెమెరాలు, బోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. సంప్రదాయ కళలు, కలంకారీ, శిల్పకళ శిక్షణకు టీటీడీ ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
 
 రూ.4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం వరకు రూ. 21 కోట్లు రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టీబీ వార్డు నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనం కోసం రూ.3.35 లక్షలతో కేటాయించారు.