టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై హరిరామజోగయ్య అసంతృప్తి

తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా రూపొందించిన మినీ మేనిఫెస్టో ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేవని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు సీహెచ్‌ హరిరామ జోగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన- టీడీపీ కూటమి మినీ మేనిఫెస్టోపై విశ్లేషణతో ఓ లేఖ విడుదల చేశారు.
 
టీడీపీ- జనసేన మినీ మేనిఫెస్టో నిరాశకు గురి చేసిందన్న ఆయన వైసిపి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మినీ మేనిఫెస్టో దీటుగా లేదని స్పష్టం చేశారు. ఇరు పార్టీలు తయారు చేసిన మినీ మేనిఫెస్టో అంత ఆకర్షణీయంగా, జనారంజకంగా లేదని పేర్కొంటూ కనీసం నాలుగు కోట్ల మంది సంతృప్తి పడేవిధంగా మేనిఫెస్టో రూపొందించడం శ్రేయస్కరం అని ఆయన సూచించారు.
 
కాగా, వచ్చే ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలో జనసేన నుంచి ముత్తా శశిధర్‌, వరప్రసాద్‌, శరత్‌ కుమార్‌ ఉంటే, టీడీపీ నుంచి యనమల రామకఅష్ణుడు, పట్టాభి, అశోక్‌ బాబు ఉన్నారు. ఈ కమిటీ సోమవారం జరిపిన భేటీలో కీలకమైన కొన్ని అంశాల్ని చర్చించింది.
జనసేన ప్రతిపాదించిన 5 అంశాలు, టీడీపీ ప్రతిపాదిత 6 అంశాలపై చర్చించి కమిటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 11 అంశాలతో తొలి దశ మేనిఫెస్టో సమావేశం జరిగింది.  ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు,  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటుకు 10 లక్షల రాయితీ, బీసీలకు రక్షణ చట్టం, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, ప్రస్తుత పథకాల కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, పేదరిక నిర్మూలన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రక్షణ, సంపన్న ఏపీ నిర్మాణం ఇలా మినీ మేనిఫెస్టో రూపొందించారు.
 
అయితే, ఇప్పటి వరకు జనసేనకు, పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడుతూ వచ్చిన హరిరామ జోగయ్య.. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.