తెలంగాణ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా బీజేపీ.. కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలలో బిజెపి కింగ్ మేకర్ గా మారుతుందని ఆ పార్టీ రాష్త్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని తమ పార్టీ నిర్ణయం ఎన్నికలపై విశేషంగా ప్రభావం చూపిస్తుందని చెబుతూ తమ అభ్యర్థుల్లో చాలా మంది గెలుపునకు దోహదపడుతుందని హిందూస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ విశేషాలు:

హెచ్‌టీ: షెడ్యూలు కులాల వర్గీకరణ దిశగా ఒక కమిటీని నియమించనున్నట్టు ప్రధాన మంత్రి మోదీ ఇటీవలే ప్రకటన చేశారు. దీని ప్రభావం బీజేపీపై ఏ మేరకు ఉంటుంది?

కిషన్ రెడ్డి: బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఈ కమిటీని ఆ సామాజికవర్గ సంఖ్యాబలాన్ని వాడుకోవడానికి కాకుండా, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. అయితే మాదిగలు బలంగా ఉన్న 24 స్థానాల్లో ఈ సోషల్ ఇంజినీరింగ్ ప్రభావం ఉండదనే విషయాన్ని నేను కాదనలేను.

హెచ్‌టీ: మీరు కింగ్ మేకర్ కావాలనుకుంటే, పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీకు పరిమిత ఎంపికలు ఉన్నందున మీరు దేన్ని ఎంచుకుంటారు?

కిషన్ రెడ్డి: ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాలనుకుంటున్నాం. కింగ్ మేకర్ స్థానాన్ని దక్కించుకోవడంలో తగినన్ని సీట్లు సాధిస్తాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఫలితాలు మరోసారి ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను, బీఆర్ ఎస్‌ను అధికారంలో ఉండగా చూశారు. బీజేపీ పాలనను ఇంకా చూడలేదు. డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం.

హెచ్‌టీ: ప్రభుత్వ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకునేందుకు ఏ రకంగా వ్యూహాలు రచిస్తున్నారు?

కిషన్ రెడ్డి: ఆదిలాబాద్, నిజామాబాద్, పాత మెదక్, కామారెడ్డి, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. బీజేపీ ఓటరు నిశ్శబ్దంగా ఓటు వేస్తాడు. మా సిద్ధాంతం కారణంగా వారు మావైపే ఉన్నారు కాబట్టి ఒప్పించాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాల్లో 20,000 మందికి పైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, మార్పు సందేశాన్ని ఓటర్లకు తెలియజేస్తున్నారు.

హెచ్‌టీ: వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని మీ పార్టీ నిర్ణయించింది. మరి సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్న అంశాలేంటి?

కిషన్ రెడ్డి: మా పార్టీలో బీసీలు చాలా మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. మేము ప్రకటన చేసినప్పుడు, అది వ్యక్తిపై ఆధారపడి చేసింది కాదు. తెలంగాణ జనాభాలో వారు అధిక శాతం ఉన్నందున ఇది సమాజ ప్రాతిపదికగా తీసుకున్న నిర్ణయం. ఎన్నికల ఫలితాలు వచ్చాక సీఎంపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.

హెచ్‌టీ: ఆరు నెలల క్రితం అధికార బీఆర్ఎస్‌కు ప్రధాన ముప్పుగా ఉన్న బీజేపీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలు వచ్చినట్లు లేవు?

కిషన్ రెడ్డి: మేం బీఆర్‌ఎస్‌తో ఉన్నామనే భావన మమ్మల్ని ప్రభావితం చేస్తోంది. వంశపారంపర్య పార్టీలు, అవినీతి పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నియోజకవర్గంలో మా క్యాడర్ ను నిమగ్నం చేస్తున్నాం. బలమైన నాయకత్వంతో ఎంతో పట్టున్న నియోజకవర్గాల్లో వచ్చే రెండు వారాల్లో ఇదే ప్రచారంతో పరిస్థితిలో మార్పు తీసుకోస్తాం.

క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఏకమై బీజేపీపై బురదజల్లుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను, కాళేశ్వరం ప్రాజెక్టును సక్రమంగా అమలు చేయడం లేదని మేం ఎండగడుతూనే ఉన్నాం.

హెచ్‌టీ: మీ పార్టీ దేని కోసం పనిచేస్తోంది? కాంగ్రెస్ ను ఓడించడమా లేక అధికారంలోకి రావడమా?

కిషన్ రెడ్డి: రెండూ. అధికారంలో ఉండేందుకు, కాంగ్రెస్‌ను ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.

హెచ్‌టీ: నామినేషన్ల తర్వాత కూడా తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కొనసాగుతోంది. నేతలు వలస వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏం చేస్తున్నారు?

కిషన్ రెడ్డి: బీజేపీ ఒక సిద్ధాంతంపై బలంగా ఆధారపడిన పార్టీ. టికెట్లు దక్కించుకుని రాజకీయంగా ఎదిగేందుకు పార్టీని ఉపయోగించుకోవాలని ఆశతో ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు కొందరు పార్టీలో చేరారు. వారి ప్లాన్ ఫలించకపోవడంతో వెళ్లిపోయారు. వేరే అంశాల ప్రాతిపదికన వలసలు లేవు.

హెచ్‌టీ: మేనిఫెస్టో గానీ, హామీలు గానీ ప్రకటించకుండా మీరు ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలని యోచిస్తున్నారు?

కిషన్ రెడ్డి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విస్మరించాయి. పెరుగుతున్న అప్పులపై ఏమాత్రం పట్టింపు లేకుండా పెద్దపెద్ద హామీలు ఇచ్చాయి. ఒక పార్టీగా బీజేపీ ఉచితాల కంటే అభివృద్ధిని నమ్ముకుంటుంది. ప్రజలు దీనిని గమనిస్తున్నారు. అలాగే, రెండు పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి 30కి పైగా టిక్కెట్లు ఇచ్చినప్పుడు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలకు అనుకూలంగా మేం టికెట్లు ఇచ్చాం. రాష్ట్రంలో 69 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీలు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వాల్సిన బాధ్యత ఉంది.