కెనడాలో దీపావళి వేడుకలపై ఖలిస్థానీ ఉగ్రవాదుల దాడి

కెనడాలో దీపావళి వేడుకలపై ఖలిస్థానీ ఉగ్రవాదుల దాడి
కెనడాలో సిక్కు వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఆ దేశ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 
 
ఇప్పటికే భారత్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలో ప్రదర్శనలు, నిరసనలు, దాడులతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా  టొరంటోకు సమీపంలోని మిసిసాగా సిటీలో ఈ నెల 12న జరిగిన దీపావళి వేడుకలపై ఖలిస్థానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఖలిస్థానీ నినాదాలు చేస్తూ.. హిందువులపై దాడులకు పాల్పడ్డారు.
 
కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుంపుగా వచ్చిన ఖలిస్తానీ మద్దతుదారులు హిందువులతో ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలిస్తానీ జెండాలతో వచ్చిన ఓ గుంపు  దీపావళి వేడుకల్లోకి ప్రవేశించింది. 
 
వారి వద్ద ఉన్న వస్తువులను అక్కడ ఉన్న హిందువులపైకి విసిరి నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మాల్టన్‌లోని వెస్ట్‌వుడ్ మాల్‌లో జరిగింది.
 
ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పోలీసులు జనాలను వెనక్కి వెళ్లమని చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కెనడాలో ఉన్న భారతీయుల భద్రత, వారిపై జరుగుతున్న దాడులను ఆపేందుకు ప్రయత్నాలు చేయాలని కెనడాకు భారత్‌కు చెప్పిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 
 
భారతీయులపై కొనసాగుతున్న హింస, ప్రార్థనా స్థలాలు, మైనారిటీలపై జాతి పరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలు చేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని కెనడాకు భారత్ చెప్పింది. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్య ఉద్రిక్తలు భారీగా పెరిగిపోయాయి. 
 
అయితే ఇటీవల కాస్త పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ  తాజా ఘటనతో మరోసారి పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ జెండాలతో వచ్చిన ఖలిస్థానీలు భారీగా నినాదాలు చేస్తూ విధ్వంసం సృష్టించారు. సంతోషంగా దీపావళి పండుగ చేసుకుంటున్న హిందువులపై రాళ్లు, చెత్త విసిరారు. 
అయితే అది చూసిన పోలీసులు మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మిసిసాగా సిటీ కౌన్సిలర్‌ కరోల్‌ పర్రిష్‌ మాట్లాడుతూ, పోలీసుల స్పందన దారుణంగా ఉందని, దీన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.