రిషి సునాక్‌పై అవిశ్వాస తీర్మానం లేఖ

బ్రిటన్ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర విమర్శల పాలవుతున్న ప్రధాని రిషి సునాక్‌‌పై సొంత పార్టీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ అవిశ్వాస తీర్మానం లేఖ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం తాలూకు ఫొటోను నెట్టింట పంచుకున్నారు.  ‘‘ఇలా చాలు. రిషి సునాక పక్కకు తప్పుకోవాల్సిందే’’ అని జెంకిన్స్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన అవిశ్వాస తీర్మానం తాలూకు లేఖను పార్టీలోని 1922 కమిటీకి పంపినట్టు చెప్పారు. ‘‘నిజం మాట్లాడినందుకు ఆమెను తప్పించారు. పార్టీలోని లెఫ్ట్ నేతల ఒత్తిడికి లోనై రిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. రిషి సునాక్ ను సాగనంపి, `నిజమైన’ కన్సర్వేటివ్ పార్టీ నేతను ప్రధానిగా చేయడానికి ఇదే సమయమని ఆమె స్పష్టం చేశారు.
“పార్టీ సభ్యులు తిరస్కరించిన వారు పార్టీ నేతగా కొనసాగడం మంచిది కాదు. ఆయనను ప్రజలు తిరస్కరించారని ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. రిషి సునాక్ పదవి నుండి తప్పుకోవడానికి ఇదే తగు సమయం” అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.  ఆమె మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు గట్టి మద్దతురాలిగా పేరొందారు. రిషి సునాక్ నాయకత్వంపై అధికార పార్టీలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఈ లేఖ స్పష్టం చేస్తుంది.
పాలస్తీనా అనుకూల ప్రదర్శన విషయంలో పోలీసులు తమ ఇష్టాఇష్టాలను అనుగుణంగా వ్యవహరించారంటూ విమర్శించిన సెయెల్లా బ్రెవర్మెన్ తన మంత్రి పదవి కోల్పోవాల్సిన విషయం తెలిసిందే. కాగా, రిషి సునాక్‌పై జెంకిన్స్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వాయుతంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పక్కకు తప్పుకోవడానికి కూడా రిషి సునాక్ కారణమని ఆరోపించారు.
బ్రెక్జిట్ కోసం బోరిస్ పార్లమెంటులో ధైర్యంగా పోరాడారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పదవుల్లో లేని అధికార పార్టీ ఎంపీలు 1922 కమిటీలో ఉంటారు. ఈ కమిటీ సభ్యులు ప్రభుత్వ, తమ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయగలరు. దేశంలో అధికార పార్టీకి మద్దతు తగ్గిపోతున్న సమయంలో ఆమె ఈ లేఖ వ్రాయడం కలకలం రేపుతోంది.
గత నెలలో ఒక సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 44 శాతం మద్దతు ఉండగా, అధికార కన్సర్వేటివ్ పార్టీకి 28 శాతం మాత్రమే మద్దతు ఉంది.బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం ఒక సంవత్సరం పాటు ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవకాశం లేదు. అయితే, అక్టోబర్ 24న ఆయన అధికారంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడంతో అవిశ్వాస తీర్మానంకు ఆయన అతీతుడు కాలేరు.