27 నుంచి ఏపీలో కులగణన

ఈ నెల 27 నుంచి కులగణన ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్త్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీన్ని డిజిటల్‌ విధానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్‌ను సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ గణన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 
సమాజంలో అణగారిన వర్గాల వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందించేందుకు వీలుగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వైసీపీ సర్కార్ తెలిపింది. దాదాపు శతాబ్దం తరువాత చేస్తున్న కుల గణన ద్వారా రాష్ట్రంలో మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు రూపుమాపేలా ప్రణాళిక రూపొందించవచ్చని పేర్కొంది. 
 
ఆరు నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తిచేసేందుకు ప్రాంతీయ, జిల్లా స్థాయి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. దీనికి కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సూచనలను స్వీకరించాలని తెలిపారు.
 
కలెక్టర్‌ నేతృత్వలోని కమిటీకి వారిని ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 15, 16 తేదీల్లోనూ.. ప్రాంతీయ స్థాయిలో 17 నుంచి 24వ తేదీ వరకు రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది.  సదస్సులను విజయవంతంగా నిర్వహించడానికి వ్యాఖ్యాతలు/మోడరేటర్లను ఎంపిక చేయాలని సూచించింది. సమావేశాలు వివాదాస్పదం కాకుండా ఉండేందుకు వారు నిర్దేశించిన అంశానికే పరిమితమై మాట్లాడేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ సదస్సులను నిర్వహించడానికి యాంకర్లు, మోడరేటర్లను ముందుగానే గుర్తించి ఎంపిక చేయడం చాలా ముఖ్యమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.  కులగణన కేవలం వ్యక్తుల కులానికి మాత్రమే పరిమితం కాకుండా వారి సామాజిక, విద్య, ఆర్థిక తదితర అంశాలపై కూడా వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. గతంలో జరిగిన కులగణనలతోపాటు, ఇటీవల బీహార్‌లో జరిగిన కులగణన కూడా ఇదే విధంగా జరిగింది.
దీనికోసం వివరాలను పూర్తిస్థాయిలో, పక్కాగా సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఒకటికి, రెండుసార్లు సంబంధిత వ్యక్తి చేత ధృవీకరించిన తరువాతే నమోదు చేయల్సి ఉంటుంది. అప్పుడే కచ్చితమైన డేటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.