30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు

ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి ఈ నెల 30వ తేదీ వరకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫైబర్‌ కేసు విషయంలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ వాయిదా పడింది. ఈనెల 30 న తిరిగి విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. 

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విషయమైన తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.  ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చడంపై ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్‌పై ఉండటంతో విచారణ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

మరోవైపు స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పులో వెలువడాల్సి ఉంది. రెండు కేసులకు సంబంధం ఉన్నందున ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పుకు వేచి ఉండాలని ఇరుపక్షాలు గురువారం విచారణలో సుప్రీం కోర్టును కోరాయి. నవంబర్ 28వరకు చంద్రబాబు బెయిల్‌ ఉన్నందున 30వతేదీన కేసు విచారణ జరపాలని ధర్మాసనం నిర్ణయించింది.

చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఒకదానితో మరొక దానికి సంబంధం ఉన్నందున విచారణపై ప్రభావం పడుతోందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. . రూ. 114 కోట్ల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేసు విచారణను నవంబర్ 30వ తేదీన విచారించనుంది. మరోవైపు సుప్రీంకోర్టుకు పదిరోజుల పాటు దీపావళి సెలవులు రానున్నాయి.

 తర్వాత స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుపనుంది. చంద్రబాబును ఇప్పటికే ఆరోగ్య కారణాలతో నవంబర్‌ 28 వరకు అరెస్ట్‌ చేయబోమని కోర్టుకు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టుకు సెలవులు ముగిసిన తర్వాత స్కిల్‌స్కాముపై క్వాష్ పిటిషన్‌ తీర్పు వెలువడనుంది.

నవంబర్‌ 30వ తేదీలోగా ఆ కేసులో ఉత్తర్వులు వెలువడితే ఫైబర్‌ గ్రిడ్‌ కేసు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైబర్‌గ్రిడ్ కేసులో మిగిలిన నిందితులకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైనందున తనకు కూడా బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సిఐడి అభియోగాలు మోపడంతో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.