అక్రమాస్తుల కేసులో జగన్ కు టీఎస్ హైకోర్టు నోటీసులు

అక్రమాస్తుల కేసులో జగన్ కు టీఎస్ హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగవంతం చేసేలా ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం  పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణకు పిల్ గా అంగీకరిస్తూ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2024లో జరిగి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సీఎం జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐను ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌ఎన్‌వీ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణను దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది. 

విచారణను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బయటకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సీఎం జగన్, సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దాదాపు పదేళ్లుగా జగన్ అక్రమాస్తుల కేసు పెండింగ్‌లో ఉందని, ఇంకా అభియోగాలు కూడా నమోదు చేయలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. 

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం సీఎం జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపిస్తూ విచారణను బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ సవాల్ చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. క్విడ్-ప్రో-కో డీల్స్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ పై 11 కేసుల్లో అభియోగాలు ఉన్నాయి.

మరోవంక, సీఎం వైఎస్ జగన్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ  రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు జడ్జి జస్టిస్ రఘునందన్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను రిజిస్ట్రీ మరో జడ్జికి అప్పగించనున్నారు.

 సీఎం జగన్ తన నిర్ణయాలతో ఆయన బంధువులు, వివిధ కంపెనీలకు కోట్ల రూపాయల లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నిర్ణయాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు.