వాయు కాలుష్యానికి దివాళీ ప‌టాసులు కార‌ణం కాదు

వాయు కాలుష్యానికి దివాళీ ప‌టాసులు ప్ర‌ధాన కార‌ణం కాద‌ని దేశంలో 90 శాతం బాణాసంచాను త‌యారుచేసే త‌మిళ‌నాడు శివ‌కాశీకి చెందిన బాణాసంచా త‌యారీదారులు స్ప‌ష్టం చేశారు. ఫైర్ క్రాక‌ర్స్‌లో నిషేధిత ర‌సాయ‌నాల వాడ‌కానికి వ్య‌తిరేకంగా తాము జారీ చేసిన ఉత్త‌ర్వులు కేవ‌లం ఢిల్లీకే కాకుండా అన్ని రాష్ట్రాల‌కూ వ‌ర్తిస్తాయ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసిన నేప‌ధ్యంలో బాణాసంచా త‌యారీదారులు స్పందించారు. 
 
ప‌టాసుల‌ను పేల్చ‌డం ద్వారా కాలుష్యం పెరుగుతుంద‌ని కాలుష్య కార‌కాల్లో లేద‌ని, అన్ని విప‌త్తుల‌కు తామే కార‌ణ‌మ‌ని చెప్ప‌డం వంద శాతం పొర‌పాట‌ని స్ప‌ష్టం చేశారు.  ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో 90 శాతం కాలుష్యానికి తొమ్మిది ఇత‌ర కార‌ణాలున్నాయ‌ని త‌మిళ‌నాడు ఫైర్‌వ‌ర్క్స్ మ్యాన్యుఫ్యాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ జి అబిరుబెన్ పేర్కొన్నారు. 
 
కాలుష్య కార‌కాల్లో తాము ఎక్క‌డా లేమ‌ని గుర్తుచేశారు. గ‌త మూడేండ్లుగా ప‌టాసుల‌ను ఢిల్లీ ప్ర‌భుత్వం నిషేధిస్తోంద‌ని, అయితే ఢిల్లీలో ఇప్పుడు వాయు నాణ్య‌త ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించారు. పంట వ్య‌ర్ధాల‌ను దగ్ధం చేయ‌డంపై ఢిల్లీ ప్ర‌భుత్వం పంజాబ్‌ను ప్ర‌శ్నించింద‌ని గుర్తుచేశారు. 
 
ప్ర‌భుత్వం నూత‌న నిబంధ‌న‌లను తీసుకువ‌చ్చిన‌ప్పుడు తాము వాటిని పాటిస్తున్నామ‌ని పేర్కొంటూ త‌మ జీవనాధారం బాణాసంచా త‌యారీ ప‌రిశ్ర‌మ‌పైనే ఆధార‌ప‌డిఉంద‌ని తెలిపారు. ఏడాదిలో 10 నెల‌లు బాణాసంచా త‌యారీలో 8 ల‌క్ష‌ల మంది నిమ‌గ్నం కావ‌డంతో వ‌ర్షాలు కుర‌వ‌కూడ‌ద‌ని కోరుకునే త‌మిళ‌నాడు జిల్లా శివ‌కాశి ఒక్క‌టే కావ‌డం గ‌మ‌నార్హం.