14 మందితో బీజేపీ తుది జాబితా విడుదల

14 మందితో బీజేపీ తుది జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్డుల తుది జాబితా ప్రకటించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. తుది జాబితాలో 14పేర్లను ప్రకటించారు. ఎనిమిది స్థానాల్లో నామినేషన్లు వేయాల్సిందిగా అభ్యర్థులకు ఢిల్లీ నుంచి గురువారమే నేరుగా అభ్యర్థులకు సమాచారం అందింది.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ తరపున ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా ప్రకటించిన సత్యనారాయణ అనారోగ్య కారణాలతో పోటీ చేయలేనని చెప్పడంతో అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటించారు. 

నామినేషన్లు వేయడానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు ఉండటంతో 8 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ గురువారం ప్రకాశ్ జావడేకర్ స్వయంగా ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బెల్లంపల్లి (ఎస్సీ రిజర్వుడ్)- కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి దేశ్‌పాండే రాజేశ్వర్ రావు, మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్‌గిరి- ఎన్ రామచందర్ రావు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, నాంపల్లి-రవిచంద్ర, చంద్రాయన్ గుట్ట- కే మహేందర్‌ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వుడ్)- గణేష్ నారాయణ్, దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి, వనపర్తి- అనుజ్ఞ రెడ్డి, అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్)- మేరమ్మ, నర్సంపేట్- కే పుల్లారావు, మధిర (ఎస్సీ రిజర్వుడ్)- పెరుమార్‌పల్లి విజయ్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 
మల్కాజ్‌గిరిలో ఎన్ రామచందర్ రావు పేరును ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గం స్టార్ వార్‌గా నిలిచినట్టయింది. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున మైనంపల్లి హనుమంతరావు పోటీలో ఉన్నారు. వారికి రామచందర్ రావు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
సంగారెడ్డి, వేములవాడ బీజేపీ అభ్యర్థుల మార్పు
కాగా, బిజెపి సంగారెడ్డి, వేములవాడ అభ్యర్థులను మార్చింది. వేములవాడ సీటకు తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించగా, చివరి క్షణంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడు చెన్నమనేని వికాస్ రావుకు బీఫామ్ ను ఇచ్చారు. ఇక సంగారెడ్డిలో దేశ్ పాండే రాజేశ్వరరావును అభ్యర్ధిగా ప్రకటించగా, పులిమామిడి రాజుకు బీ ఫాం ఇచ్చారు.