తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బిజెపికి ఓటు

ఈనెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పిలుపు నిచ్చారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.  చౌటుప్పల్ మండలం నుండి కేంద్ర మంత్రులతోపాటు వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, వెంటరాగా నియోజకవర్గంలోని వివిధ మండలాల మీదుగా ర్యాలీగా చండూరు చేరుకుని మంత్రి, నాయకులతో కలిసి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 
 
కేంద్ర మంత్రి శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణారెడ్డి తన తల్లి పాదాలకు నమస్కరించి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనురాగ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. 
 
సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, అవినీతి కుంభకోణాలలో కూరుకు పోయారని కేంద్ర మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప ప్రజలు ఎవరు కూడా అభివృద్ధి చెందలేదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు బీఆర్ఎస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. 
 

గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల గురించి పట్టించుకోలేదని, అందువల్లనే ప్రజలు కూడా కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి కోసం బిజెపిని గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రకొంటూ మునుగోడు ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అనురాగ్ సింగ్ ఠాగూర్ కోరారు. చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డగా ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. తనను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ప్రజలకు అన్నివేళలలో అందుబాటులో ఉండి నిస్వార్ధంగా సేవ చేస్తానని తెలిపారు.