బంగాళాఖాతంలో భూకంపం.. అండమాన్‌ లో అప్రమత్తం

బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.  అండమాన్‌ నికోబార్‌ దీవులకు వాయవ్య దిశగా సుమారు 200 నాటికల్‌మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది.
సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల అండమాన్‌ నికోబార్‌ దీవులు ప్రభావితమయ్యాయి. తీరంలో అలలు పోటెత్తడంతో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. కాగా, తీర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. సునామీ ముప్పు లేదని తెలిపారు. 
సోమవారం ఉత్తరాఖండ్‌లోని పితోరాగ్రాఫ్‌ జిల్లాలో 5.6 తీవ్రతతో భూమి కంపించింది. అయితే దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదు.  ఇక నేపాల్‌లోని కఠ్మండూలో నిన్న ఉదయం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత శుక్రవారం అర్ధరాత్రి నేపాల్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి 150 మందికిపైగా మరణించారు.

ఇలా ఉండగా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు నీలగిరి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ముదురై, విరుదనగర్, నాగపట్నంలో వర్షం బీభత్సం సృష్టించింది.  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకార్మికులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్రంతో దక్షిణ కర్నాటక, రాయలసీమ, కేరళ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.