పర్వతాల్లో నిప్పులు కురిపించిన ఆర్మీ హెలికాప్టర్‌ రుద్ర

ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ రుద్ర తన సత్తా చాటింది. పర్వతాల్లో నిప్పులు కురిపించింది. బుల్లెట్లు, రాకెట్లతో టార్గెట్లను చేధించింది. అత్యాధునిక ఫైటర్‌ హెలికాప్టర్‌ రుద్రాను ఆర్మీకి చెందిన ఏవియేషన్ యూనిట్ విజయవంతంగా పరీక్షించింది. ఈశాన్య ప్రాంతంలోని ఒక ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి మూడు సాయుధ హెలికాప్టర్లు టేకాఫ్‌ అయ్యాయి. కొత్త రాకెట్లు, మందుగుండును పరీక్షించాయి.

కాగా, రుద్రా హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఆర్మీ పేర్కొంది. ‘తొలి స్వదేశీ ఎటాక్‌ హెలికాప్టర్ రుద్ర నుంచి న్యూ జనరేషన్ రాకెట్, టరెట్ మందుగుండు సామగ్రిని ఆర్మీ ప్రయోగించింది. పర్వతాల్లో పోరాట సామర్థ్యాన్ని ఇది చాటింది. ఏవియేటర్ల కార్యాచరణ, సంసిద్ధతను కార్ప్స్ కమాండర్ అభినందించారు’ అని స్పియర్ కార్ప్స్ పేర్కొంది. 

రాకెట్ల ద్వారా నిప్పులు ఎగజిమ్మడంతోపాటు గుళ్ల వర్షం కురిపించిన రుద్ర హెలికాప్టర్‌ ఫొటోలు, వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మరోవైపు భారత వైమానిక దళం, ఆర్మీ అవసరాల కోసం అత్యాధునిక ఫైటర్‌ హెలికాప్టర్‌ రుద్రాను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌) తయారు చేసింది.  5.8 టన్నుల బరువున్న మల్టీరోల్ ఛాపర్‌లో 20 ఎంఎం టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్ సిస్టమ్‌ ఉన్నాయి. ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కూడా ఇది మోసుకెళ్తుంది.  శత్రువుల యుద్ధ ట్యాంకులను నాశనం చేస్తుంది. నిఘాతోపాటు భూ దళాల కదలికలు,ఫైరింగ్‌కు ఎంతో సహకరిస్తుంది.