విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. విజయసాయి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో  పేర్కొంటూ ఆయన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు. అధికారంలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని ఆ లేఖలో ఆమె ఆరోపించారు.
 
ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పు దోవ పట్టించారని ఆమె తెలిపారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను లేఖ ద్వారా పురందేశ్వరి ఫిర్యాదు చేశారు.
 
విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆమె ఆరోపించారు. మోసం చేయడం, అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (ఐపీసీ సెక్షన్-420) నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (ఐపీసీ సెక్షన్-120బి) విజయసాయిరెడ్డిపై ఉన్నాయని ఆమె వివరించారు.
 
మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (ఐపీసీ సెక్షన్-468), పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (ఐపీసీ సెక్షన్-409), నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (ఐపీసీ సెక్షన్-471), ఖాతాల తప్పుడు సమాచారం (ఐపీసీ సెక్షన్-477ఎ)కి సంబంధించిన 1 అభియోగం ఉన్నట్లు పురందేశ్వరి తెలిపారు.

ఈ అభియోగాలను పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయని ఆమె పెర్కోన్నారు. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని ఆమె చెప్పారు.

 ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయిరెడ్డి చేయగలడో కూడా వివరించబడిందని ఆమె పేర్కొన్నారు. కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి అని ఆమె తెలిపారు. 

ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెబుతూ ఈ కేసులో సాయిరెడ్డిని సిబిఐ ‘కింగ్‌పిన్’ (మూల విరాట్ ) గా పేర్కొందని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు నిత్యం అందుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

 న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం, విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారని పురందేశ్వరి తీవ్రమైన ఆరోపణలు చేశారు. 
 
ఈ మేరకు లేఖతో పాటు ఐదు డాక్యుమెంట్లను కూడా పురందేశ్వరి జతచేశారు. పదేళ్లకుపైగా బెయిల్‌పై ఉన్నారని, ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారని, పదే పదే వాయిదాలతో విచారణకు రాకుండా ఉంటున్నారని ఆమె ఆ లేఖలో వివరించారు.