ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో త్వరలోనే కవిత నంబర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు ఉందని, ఆమె నంబర్  కూడా త్వరలోనే వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి  అవినీతి చేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి నెంబర్ వస్తుందని.. వాళ్లు కూడా జైలుకు వెళ్లక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
 తెలంగాణ సెంటిమెంట్‌తో పెట్టిన టీఆర్ఎస్‌ పార్టీ పేరును పదేళ్లకే బీఆర్ఎస్ అని మార్చేసి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ కలలు కన్నారని, కానీ ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం చేసి దేశం మొత్తం ఫేమస్ అయ్యారంటూ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని కేసీఆర్.. తన కూతురిని ఢిల్లీకి పంపి లిక్కర్ స్కాం చేపించారంటూ విమర్శలు గుప్పించారు. 
 
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే జైల్లో ఉన్నారని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు కూడా నోటీసులు అందాయని ఠాకూర్ గుర్తు చేశారు. ఈ కుంభకోణంలో కవిత పాత్ర కూడా ఉన్నదంటూ ఆమెను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్‌లో టీమిండియా అదరగొడుతోందన్న అనురాగ్ ఠాకూర్ తెలంగాణ ఎన్నికల మ్యాచ్‌ కోసం తనను బ్యాట్స్ మెన్‌గా పంపారంటూ చలోక్తులు వదిలారు. 
 
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉద్యోగాలు.. ఈ హామీలన్ని ఏమయ్యాయని ప్రశ్నించారు.  గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని చెబుతూ కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అని ధ్వజమెత్తారు. 
 
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదని.. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు అంటూ విమర్శించారు. 
 
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేయటం వల్ల ఎంతో మంది యువకులు అమరులయ్యారని చెబుతూ పార్లమెంట్‌లో సోనియాతో పాటు ఆ పార్టీ నేతలు ఎలా వ్యవహరించారో తనకు తెలుసని చెప్పారు. తెలంగాణ వచ్చాక అయినా ప్రజలకు కేసీఆర్ మంచి చేస్తారనుకుంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారంటూ కేంద్ర మంత్రి  విమర్శించారు.