రిషికొండ భవనాలపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

రుషికొండలో భవనాల నిర్మాణాలపై జోక్యం చేసుకోవాలంటూ విజయవాడకు చెందిన పర్యావరణవేత్త లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. రాజకీయ కారణాలతోనే సుప్రీం కోర్టుకు వచ్చారని, సుప్రీంకోర్టు రాజకీయాలకు వేదిక కాదని సీజేఐ స్పష్టం చేశారు. 
 
ఇలాంటి కేసుల్ని ఉపేక్షించలేమని తేల్చి చెప్పారు. పర్యావరణ అంశాలు ఉన్నాయని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా సీజేఐ అందుకు అనుమతించలేదు. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని రుషి కొండకు వెళ్లవద్దని అంటున్నారని, ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని సిజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు.
 
పిటిషన్‌లో రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని పేర్కొంటూ ఇప్పటికే హైకోర్టులో, ఎన్జీటిలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. పిటిషన్ సహేతుకంగా లేదని భావించిన ధర్మాసనం డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరిగాయని , సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబందించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తుది విచారణ జరగాల్సి ఉందని,  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం రుషికొండ మీద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్‌ 11న ఇచ్చిన జీవో 2015 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 , 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.