జగన్ కేసుల విచారణలో జాప్యం దేనికి?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు జాప్యం జరుగుతోందో వివరించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌ కేసుల విచారణ నిరవధికంగా ఆలస్యం జరుగుతున్నందున ఈ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎందుకు విచారించకూడదో చెప్పాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీ భట్టిలతో కూడిన ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. విచారణ జాప్యానికి గల కారణాలను వివరించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ రఘురామకృష్ణ రాజును ప్రతిపక్ష పార్టీ నేతగా ధర్మాసనం భావించగా ఆయన తరఫు న్యాయవాది ఒకే పార్టీకి చెందిన నేత అంటూ వివరించారు. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామరాజు  ఈ పిటీషన్ దాఖలు చేశారు.

 ప్రస్తుతం తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసు 3,071 సార్లు వాయిదా పడిందని తెలిపారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపునిచ్చిందని తెలిపారు.  వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేశారని, కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి కేసుల విచారణ బదిలీ చేసి విచారణ వేగంగా ముందుకు సాగేలా ఆదేశాలివ్వాలని రఘురామ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.

సీబీఐతో పాటు ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అరబిందో, హెటెరో, ట్రైడెంట్‌, జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానందరెడ్డి, పి.శరత్‌చంద్రారెడ్డి, బి.పి. ఆచార్య, యద్ధనపూడి విజయలక్ష్మీ ప్రసాద్‌, పీఎస్‌ చంద్రమౌళి తదితరులకూ నోటీసులు జారీ చేసింది.