కేసీఆర్ వెంటనే పదవి నుండి తప్పుకోవాలి

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్​కు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్​వహించాలని, వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్​నిర్లక్ష్యం కారణంగా లక్ష కోట్ల ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆరోపించారు.  80 వేల పుస్తకాలు చదివిన మేధావి తెలంగాణ మేధావుల మాట వినకుండా ప్రాజెక్ట్ నిర్మించి కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరిలో పోశారని మండిపడ్డారు. 
ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్​కు సిగ్గుండాలని విమర్శించారు.  ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి ఇతర నాయకులతో కలిసి శనివారం ఆయన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు.
 
మేడిగడ్డ పిల్లర్లు క్రాక్స్ వచ్చిన విషయం తెలియగానే కేంద్రమంత్రిగా కేంద్ర జల శక్తి కమిషన్​కు లేఖ రాశానని, లేఖపై స్పందించిన నేషనల్​డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలనకు వచ్చిందని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా మేడిగడ్డ లాగానే ఉందని, ఒక్క టీఎంసీ నీళ్లయినా నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడిందని కిషన్​రెడ్డి విమర్శించారు. 
 
ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేసిన అంచనాలను పూర్తిగా మార్చేసి ప్రణాళిక లేకుండా ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం మొత్తం చెప్పినా వినకుండా కేసీఆర్​ఒంటెత్తు పోకడలతో ప్రాజెక్టును నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కనీసం ఇంజినీర్లు చెప్పినా వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని పేర్కొంటూ కేసీఆర్​ వల్ల ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారిందని విమర్శించారు. ప్రజాధనం వృథా చేసి నాసిరకం ప్రాజెక్ట్ కట్టారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ చాలా గొప్పదని డిస్కవర్ ఛానల్​లో కూడా ప్రసారం చేయించారని, మరి బ్యారేజీ డ్యామేజ్​అయినా ఇంతవరకు సీఎం కేసీఆర్​నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.