భుజ్ లో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యమండలి సమావేశాలు 

భుజ్ (గుజరాత్)లో నవంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారత కార్యమండలి సమావేశాలు జరుపుతున్నట్లు సంఘ్  అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ సమావేశాలలో ప్రాంత సంఘచాలక్, కార్యవాహ, ప్రాంత ప్రచారక్, సహ-సంఘచాలక్, సహ-కార్యవా, సహ-ప్రాంత ప్రచారక్ లు మొత్తం 45 ప్రాంతాల నుండి పాల్గొంటారు. 
 
సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, సహా సర్ కార్యవహ్ లు డా. కృష్ణగోపాల్, డా. మన్మోహన్ వైద్య, ముకుంద, అరుణ్ కుమార్, రామదత్ చక్రధర్, కార్యకారిణి సభ్యులు కూడా పాల్గొంటారు. అంతేకాకుండా, విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్‌తో సహా వివిధ సారూప్య సంస్థల సంఘటనా కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 
 
ఈ సమావేశంలో సంఘ్‌ పనితీరుపై సమీక్షతోపాటు గత నెల సెప్టెంబర్‌లో పూణెలో జరిగిన అఖిల భారత సమన్వయ సమావేశంలో, ఇటీవల నిర్వహించిన విజయదశమి ఉత్సవ్‌లో సర్ సంఘచాలక్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాల గురించి కూడా చర్చిస్తామని  సునీల్‌ అంబేకర్‌ మీడియా సమావేశంలో వివరించారు. 
 
అదేవిధంగా సంఘ్‌లో ప్రతిపాదిత మార్పులు, ముఖ్యంగా మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం శిక్షావర్గ్ లలో అంశాలను మార్చే ప్రణాళికగురించిన చర్చ  కొనసాగుతోంది. జనవరి 22, 2024న అయోధ్యలో జరగనున్న శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ట ఉత్సవానికి సంబంధించిన అంశాలు, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిపాదిత కార్యక్రమాలు గురించి కూడా చర్చిస్తారు. 
 
దేశవ్యాప్తంగా ప్రతి నగరం, గ్రామంలోని వివిధ దేవాలయాలలో ఒక కార్యక్రమం కోసం పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమైన పనిలో సంఘ్ ఎలా పాల్గొంటుందో ఈ సమావేశంలో చర్చించి,  ఈ విషయమై స్వయంసేవక్ లు అందరికి, మొత్తం సమాజానికి ఈ సమావేశం తర్వాత పిలుపు ఇవ్వడం జరుగుతుంది. 
 
2025లో సంఘ్ పని ప్రారంభమై 100 సంవత్సరాలు అవుతుంది. 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిని సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్  ప్రారంభించారు. ఈ పని 98 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతుంది.  2025 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పని విస్తరణ ప్రణాళికపై నిరంతర కృషి జరుగుతోంది.
 
కార్యవిస్తరణకోసం చాలామంది శతాబ్ది విస్తారక్‌లు కూడా వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సందర్భంగా నిర్దేశించిన లక్ష్యాలను శాఖ విస్తరణకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో లక్ష్య సాధనపై సమీక్షించనున్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో లక్ష్యాలను ఎలా చేరుకోవాలి? దీనికి సంబంధించి చర్చ జరుగుతుందని అంబెకర్ తెలిపారు. 
 
శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రానున్న కాలంలో సమాజం ముందుకు ఎలా తీసుకురావాలి? అన్న అంశంపై చర్చ జరగనుంది. తన విజయదశమి ప్రసంగంలో, సర్ సంఘచాలక్ శాఖ చుట్టూ ఉన్న ప్రాంతంలో సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామరస్యం కోసం కృషి చేయడం, పర్యావరణానికి సంబంధించి ఒకరి జీవనశైలి ఎలా ఉండాలి, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, సంతోషకరమైన కుటుంబాన్ని, సామాజికంగా పనిచేసే కుటుంబాన్ని ఎలా సృష్టించాలి? స్వదేశీ, పౌర విధితో సహా ఐదు వంటి నిర్దిష్ట పిలుపులు ఇచ్చారు. 
 
 దేశంలో సంఘ్ పని గురించి చర్చ జరిగినట్లే, క్షేత్రస్థాయి అనుభవాల గురించి కూడా చర్చ జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం నవంబర్ 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.