రెండు రోజులుగా కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

రెండు రోజులుగా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న సోదాలు తెలంగాణ ఎన్నికల సమయంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా, శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత, మాజీ మంత్రి కె జానారెడ్డి ఇంట్లో కూడా సోదాలు ప్రారంభించారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రఘువీర్ నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
 
ఇక గురువారం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకే బాలాపూర్‌లోని పారిజాత ఇంటికి ఐటీ అధికారుల బృందం చేరుకుంది. ఆ సమయంలో పారిజాత తిరుపతిలో, నరసింహారెడ్డి దిల్లీలో ఉన్నారు. నవంబర్ 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి అధాయపన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
 
బాలాపూర్‌కే చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వంగేట లక్ష్మారెడ్డి ఇంటికి కూడా అధికారులు వెళ్లి సోదాలు చేపట్టారు. సోదాల సందర్భంగా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేటలో నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేత బంధువు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఆయన కూడా స్థిరాస్తి వ్యాపారే.  నార్సింగ్‌లోని  కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలో శుక్రవారం కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి 1గంట వరకూ ఐటీ బృందం సోదాలు జరిపించింది. ఇంట్లో లభ్యం అయిన పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. మరో 15 మంది అధికారులతో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
మాదాపూర్‌లోని కేఎల్ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ఫామ్ హౌజ్ సోదాలు ముగిసిన తర్వాత అక్కడ స్టేట్‌మెంట్‌ను అధికారులు నార్సింగ్ ఇంటికి తీసుకొచ్చారు. మరోసారి 5 వాహనాలలో లక్ష్మారెడ్డి ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు. సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది.
 
కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి భయభ్రాంతులను గురిచేస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహేశ్వరంలో సబితారెడ్డి ఓడిపోతున్నారని భయపడిన సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం, పీయూష్‌ గోయల్‌ సహకారంతో తమ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు చేయించారని ఆయన ఆరోపించారు.