వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి

దేశ రాజధాని నగరం ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం ఉద‌యం రాజధాని నగరంలోని చాలా ప్రాంతాలు పొగ‌తో క‌మ్ముకుపోయాయి. మరోవైపు వాయు కాలుష్యానికి చలి తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 
గత కొన్ని రోజులుగా ఢిల్లీ మొత్తంగా దట్టమైన పొగమంచు అలుముకుంటున్నది. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 346గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. 
లోధీ రోడ్‌, జ‌హంగిర్‌పురి, ఆర్కే పురం, ఐజీఐ ఎయిర్‌పోర్టులో వాయు నాణ్యత 438, 491, 486,473గా ఉన్నట్లు సీపీసీబీ వివరించింది. 
తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. జీఆర్ఏపీ స్టేజ్ త్రీ కింద ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ ప‌నులపై ఆంక్షలు విధించారు. 
 
లైట్ క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలపై కూడా నిషేధం అమ‌లు చేస్తున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో త‌క్షణ‌మే జీఆర్ఏపీ షెడ్యూల్‌ను అమ‌లు చేయాల‌ని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.  వాయు నాణ్యత‌ను పెంచేందుకు ఢిల్లీ మున్సిపాల్టీ ప‌లు ప్రాంతాల్లో రోడ్లు, చెట్లపై నీళ్లు చ‌ల్లుతోంది.
 
ఎయిర్ క్వాలిటీ 400 దాటిన ప్రాంతాల్లో నిర్మాణ ప‌నుల‌ను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వాయు కాలుష్యం పెరగడంతో ప్రభుత్వ ఆరోగ్య భద్రత కోసం ఢిల్లీలో అత్యవసరం కాని నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఢిల్లీలో ఐదు రోజుల పాటు నిర్మాణ పనులను నిలిపివేయాల్సిందిగా బుధవారం ఢిల్లీ పర్యావరణ మంత్రి ప్రకటించారు. 
 
పొలాల్లో పంటవ్యర్థాల దగ్ధం, అననుకూల వాతావరణం కొనసాగుతున్నందున రానున్న రెండు వారాల్లో ఢిల్లీ- ఎన్‌సిఆర్‌ పరిధిలో కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని, దీంతో దగ్గు, జలుబు, కళ్ల నుండి నీరు కారడం వంటి సమస్యలు పెరగడంతో రోగుల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.