దేశంలో 12 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు

భారత్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రమాదాలు, మృతుల సంఖ్య పెరగడానికి అధిక వేగం ప్రధాన కారణమని స్పష్టం చేసింది. 2022లో 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదైనట్లు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

2021లో ఈ ప్రమాదాల సంఖ్య 4,12,432 కాగా, 11.9 శాతం పెరిగినట్లు తెలిపింది. గతేడాది ఈ ప్రమాదాల్లో 1,68,491 మంది మరణించగా, 4,43,366 మంది గాయాలపాలైనట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మరణాలు 9.4 శాతం పెరగగా, గాయాలపాలైన వారి సంఖ్య 15.3 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.

2022లో 3.3 లక్షల ప్రమాదాలకు అతివేగంతో పాటు ర్యాష్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు తెలిపింది. ర్యాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌తో 71.2 శాతం మంది మరణించారని నివేదిక పేర్కొంది. 

2022లో మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడంతో సుమారు 10,000కు పైగా ప్రమాదాలు జరిగినట్లు వెల్లడించింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలతో 2021లో 2,203 ప్రమాదాలు రికార్డవగా, 2022లో 4,021 ప్రమాదాలు రికార్డయ్యాయని, 82.55 శాతం పెరుగుదల ఉన్నట్లు ప్రకటించింది.

2022లో బైక్‌ ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించకపోవడంతో 50,029 మంది వ్యక్తులు మరణించినట్లు తెలిపింది. వారిలో 35,692 మంది డ్రైవర్లు కాగా, 14,337 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే సీట్‌ బెల్ట్స్‌ ధరించకుండా 16,715 మంది మరణించగా, వారిలో 8,384 మంది డ్రైవర్లు కాగా, అంతే మొత్తంలో ప్రయాణికులు మరణించారు.