ఇసుక అక్రమాలలో ఏపీ సీఐడీ చంద్రబాబుపై మరో కేసు

ఇసుక అక్రమాలలో ఏపీ సీఐడీ చంద్రబాబుపై మరో కేసు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తాజాగా మరో కేసును ఏపీ సీఐడీ నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లను సీఐడీ చేర్చింది. 
 
టీడీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చేలా వీరంతా వ్యవహరించారనే ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుక ముసుగులో మొత్తం రూ. 10వేల కోట్ల దోపిడీ చేవారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఉంది. కాగా, చంద్రబాబు హయాంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 
 
ఈ నలుగురితో పాటు మరికొందరిపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది.  చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి, 52 రోజులపాటు జైలులో ఉండి, అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మూడు రోజుల క్రితమే బైటకు వచ్చారు. ఇంకా, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, మద్యం, అసైన్డ్ ల్యాండ్‌లకు సంబంధించి చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి.

గత నెల 3వ తేదీన ఈ అంశంపై మైనింగ్ విభాగం నుంచి ఫిర్యాదు అందినట్లు తాజా ఎఫ్ఐఆర్ లో తెలిపారు. మైనింగ్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్రీ శాండ్ పాలసీ విధానం, అమలులో అవకతవకల పై సీఐడీ విచారణ చేపట్టగా ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని ‌సీఐడీ గుర్తించింది.

“గనులు ఖనిజాలకు సంబంధించి 1957లోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. గనులు, ఖనిజాలకు సంబంధించి రెగ్యులేటింగ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వమే. అయితే 2014 నుంచి ఇసుక లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. ఆగస్టు 28, 2014న ఇసుక రీచ్‌లన్నింటినీ  ఏపీ ఎండీసీ కి అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది” అని తెలిపారు. 

తర్వాత ఈ రీచ్‌లను జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. తర్వాత 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీకి అప్పగించారు. కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జనవరి 15, 2016లో మరొక జీవో జారీచేశారు. టెండర్‌ కం ఇ-ఆక్షన్‌ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. అనూహ్యంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే దీన్నికూడా పక్కపెట్టారు. 

ఉచితంగా ఇసుక అంటూ మార్చి 4, 2016ఒక మెమో జారీచేశారు. దీనికి అనుగుణంగా ఏప్రిల్‌ 6, 2016న జీవో 43 జారీచేశారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఇసుక పాలసీ విషయంలో కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకున్న రెండునెలల వ్యవధిలోనే మళ్లీ ఈనిర్ణయం తీసుకున్నారని డీఎంజీ వెంకటరెడ్డి  సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.