ఎథిక్స్ కమిటీ సమావేశంలో గందరగోళం.. ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్

“ప్రశ్నకు డబ్బు” వ్యవహారంలో గురువారం టిఎంసి ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంటరీ ఎథిక్ కమిటీ ముందు హాజరు కాగా సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇంకా విచారణ జరుగుతుండగానే మోయిత్రాతో పాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు. మోయిత్రాకు వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలను కమిటీ సంధించిందని, దాంతో పెద్ద దుమారం చెలరేగిందని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ పేర్కొన్నారు.

ఇదే సమయంలో మహువా మోయిత్రా కూడా ఈ సమావేశంపై నిప్పులు చెరిగారు. అసలు ఇదేం మీటింగ్? కమిటీ సభ్యులు నీచమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యక్తిగత విషయాలపై కూడా ప్రశ్నలు వేస్తున్నారు. విచారణ సమయంలో నా కళ్లల్లో నీళ్లు వచ్చాయని తెలిపారు. 

“నా నీళ్లల్లో నీళ్లు మీకు కనిపిస్తున్నాయా’’ అంటూ మీడియాతో మాట్లాడుతూ మోయిత్రా తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకుముందు కూడా, వ్యక్తిగత ప్రశ్నలు అడిగినప్పుడు మోయిత్రా వాటికి జవాబు చెప్పేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాల్ని ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదని ఆమె పదేపదే పునరుద్ఘాటించారని తెలిసింది. 

అయినా తన స్నేహితుడి వద్ద నుంచి బహుమతి లభిస్తే, ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీ ముందు ఎలా తీసుకొస్తారని మోయిత్రా ప్రశ్నించారు. అయితే, ఎథిక్స్ కమిటీ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సమయంలో మహువా మోయిత్రా ఏమాత్రం సహకరించలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకార్ తెలిపారు. 

తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆమె తమ మీద కోపం ప్రదర్శించిందని పేర్కొన్నారు. అన్‌పార్లమెంటరీ భాషను కూడా ఉపయోగించిందని తెలిపారు. తాము సంధించిన ప్రశ్నలను దాటవేసేందుకు మోయిత్రాతో పాటు ప్రతిపక్ష ఎంపీలు తమపై నిందలు మోపుతూ సమావేశం నుంచి వాకౌట్ చేశారని సోంకార్ చెప్పుకొచ్చారు.

పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం అనంతరం బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ సమావేశంలో మహువా మోయిత్రా వ్యవహరించిన తీరు ఖండించతగిందని,  చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులందరినీ ఉద్దేశించి అన్‌పార్లమెంటరీ పదాలు వాడారని తెలిపారు. కమిటీ చైర్మన్‌ హీరానందానీ అఫిడవిట్‌లోని విషయాలపై ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదని, ఆ తర్వాత రచ్చ సృష్టించారని అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, జాతీయ మీడియా కథనాల ప్రకారం ‘‘వ్యక్తిగత సంబంధం”లో నెలకొన్న అపార్థాల కారణంగానే ఈ ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వివాదం చెలరేగిందని మోయిత్రా చెప్పినట్టు తెలిసింది. తన మాజీ ప్రియుడైన సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌ను తాను బహిష్కరించానని కూడా ఆమె తెలిపింది. 
 
తాను డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగానన్న ఆరోపణల్ని మోయిత్రా తోసిపుచ్చింది. కానీ,  హీరానందానీకి తన పార్లమెంటరీ లాగిన్ ఐడీని ఇచ్చినట్లు మోయిత్రా అంగీకరించింది. అయితే, పార్లమెంట్ అడిగిన ప్రశ్నలు మాత్రం తనవేనని పేర్కొంది. కాగా.. కేంద్ర, ఐటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి అందించిన నివేదికలు, డాక్యుమెంట్ల ఆధారంగా ఎథిక్స్ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసింది. వాటి ఆధారంగానే ఆమెకు ప్రశ్నలు సంధిస్తోంది.

మరోవంక, ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ తక్కువ కులానికి చెందినవారని, అందుకే వాళ్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఈ విచారణకు కారణమైన అసలు ఫిర్యాదుదారుడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసం మోయిత్రా తన మనస్సాక్షిని అమ్ముకున్నారని ఆరోపించారు. తమతో పాటు ఇతరులు అందించిన అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత మహువా మొయిత్రాను ఏ శక్తీ రక్షించలేదని స్పష్టం చేశారు.