ముఖ్యమంత్రి షిండే హామీతో మనోజ్‌ జరంగే దీక్ష విరమణ

మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త మనోజ్‌ జరంగే తన దీక్షను విరమించారు. జల్నా జిల్లాలోని అంతర్వాలీ సారతిలో చేపట్టిన ఆయన దీక్ష ఏడో రోజుకు చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మంగళవారం ఫోన్‌ చేసి మాట్లాడారు. 
 
మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ వర్తించేలా కున్బీ సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీతో సంతృప్తి చెందిన మనోజ్‌ దీక్ష విరమించారని సీఎంవో ప్రకటన విడుదల చేసింది.
గత వారం రోజులుగా అహింసాత్మకంగా మారిన మరాఠా రిజర్వేషన్ ఆందోళన ఇప్పుడు ప్రశాంత పరిస్థితులకు చేరుకొనే అవకాశం ఏర్పడింది.
కున్బీ సర్టిఫికెట్‌ మరాఠాలను ఓబీసీలుగా పరిగణించడానికి అవకాశం కల్పిస్తుంది. వ్యవసాయం జీవనాధారంగా ఉండే కున్బీలు మహారాష్ట్రలో ఓబీసీలుగా కొనసాగుతున్నారు.  మరాఠాలకు కున్బీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మంగళవారమే ప్రారంభించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని షిండే చెప్పారు. మరాఠా రిజర్వేషన్ల కోసం సామాజిక కార్యకర్త మనోజ్‌ అక్టోబరు 25న ఆమరణ దీక్ష ప్రారంభించిన తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. 
 
సోమవారం ఆందోళనకారులు ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు మజల్‌గావ్‌లో మునిసిపల్‌ కౌన్సిల్‌ భవనానికి నిప్పు పెట్టారు. మరాఠా కోటాకు మద్దతు తెలుపుతూ ఇద్దరు శిందే వర్గానికి చెందిన సేన ఎంపీలు, ఓ ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేశ్‌ వార్పుడ్కర్‌, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ పవార్‌ కూడా రాజీనామా చేశారు. 
 
కాగా, నిరసనకారులు రెచ్చిపోతున్న నేపథ్యంలో సీఎం, మంత్రుల నివాసాల సముదాయమైన మంత్రాలయ వద్ద, పార్టీ కార్యాలయాలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం మరాఠా కోటా మద్దతుదారులు పుణేలోని ముంబై- బెంగళూరు రహదారిని దిగ్బంధించారు. బీడ్ జిల్లాలోను, ధారాశివ్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి అధికారులు కర్ఫ్యూ విధించారు. 

మ‌రాఠా కోటాకు మ‌హా స‌ర్కార్ సానుకూలం

మ‌రాఠాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స్ప‌ష్టం చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బీద్‌లో సోమ‌వారం జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను ఫ‌డ్నవీస్ ఖండించారు. హింస‌ను వ్యాప్తి చేసేందుకు ప్ర‌య‌త్నించే వారిపై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని ఆయన హెచ్చ‌రించారు.

మ‌రాఠాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చాలా సానుకూలంగా ఉంద‌ని, ఈ దిశ‌గా ఈరోజే కొన్ని నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయ‌ని, కానీ కొంద‌రు హింస‌ను వ్యాప్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయన మండిపడ్డారు. బీద్ ఘ‌ట‌న‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌ల‌కు బాధ్యుల‌ను గుర్తించామ‌ని, ప్ర‌జ‌ల‌ను స‌జీవ ద‌హ‌నం చేసేందుకు కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌య‌త్నించ‌డం సీసీటీవీ ఫుటేజ్‌లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని తెలిపారు. ఇది తీవ్ర సంఘ‌ట‌న అని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేస్తామ‌ని ఫ‌డ్నవీస్ చెప్పారు. అయితే, శాంతియుత నిర‌స‌న‌లు చేప‌ట్టే వారిపై ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరపండి

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఆందోళన రానురాను హింసాత్మకంగా మారుతున్నందున ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మహారాష్ట్ర విపక్ష నాయకుడు విజయ్ వడెట్టియార్ మరాఠా సమాజానికి బూటకపు హామీలు ఇవ్వడం, పొరపాటు నిర్ణయాలు తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణంగా ఆరోపించారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా తయారైందని చెబుతూ వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. ఈ రిజర్వేషన్ సమస్య రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. 30 రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆ మాట నిలుపుకోలేదని విమర్శించారు.