మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్ పోలీసు అధికారి కాల్చివేత

మయన్మార్‌కు సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌కు చెందిన మోరే పట్టణంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని ముష్కరులు జరిపిన కాల్పులలో ఒక సబ్ డివిజనల్ పోలీసు అధికారి(ఎస్డిపిఓ) మరణించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మోరేలో కొత్తగా నిర్మిస్తున్న హెలిప్యాడ్‌ను ఎస్డిపిఓ చింగం ఆనంద్ కుమార్,తనిఖీ చేస్తుండగా కొందరు గుర్తు తెలియని ముష్కరులు ఆయనపై కాల్పులు జరిపారని, తీవ్రంగా గాయపడిన ఎస్‌డిపిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వర్గాలు తెలిపాయి.

ఎస్‌డిపిఓ సారథ్యంలోని పోలీసు బృందంపై దాడి చేయడానికి ముష్కరులు స్నైపర్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడి వెనుక కుకీ తిరుగుబాటుదారులు ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సీనియర్ పోలీసులు, పారా మిలటరీ అధికారుల నేతృత్వంలో అదనపు భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.

సరిహద్దు పట్టణమైన మోరే నుంచి పోలీసులను తొలగించాలని పలు గిరిజన సంఘాలు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. మోరే పట్టణంలో చోరీ కేసులకు సంబంధించి పెద్ద సంఖ్యలో మయన్మార్ జాతీయులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.  అయితే పోలీసులు మాత్రం గిరిజనులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు సాగిస్తున్నారంటూ గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఏడాది మే నెలలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన నాటి నుంచి 800 మందికి పైగా మరణించగా 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. తెంగనౌపాల్ జిల్లాలో ఉన్న మోరే పట్టణంలో కుకీల ప్రాబల్యం అధికం. మే 3వ తేదీన ఘర్షణలు చెలరేగిన తర్వాత వందలాది మైతేయులు ఈ పట్టణాన్ని వదిలి పారిపోయారు. మైతేయులకు చెందిన అనేక ఇళ్లు, దుకాణాలను దుండగులు తగలబెట్టారు.