చైనా, పాక్ సరిహద్దుల్లో ఎస్-400 క్షిపణుల మోహరింపు

ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ పాక్‌, సైన్యాన్ని మోహరిస్తూ చైనా.. సరిహద్దుల్లో అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాయి. అయితే ప్రతిగా భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికను సమకూర్చుకుంటూ సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది. ఈ రెండు కీచక దేశాల నుంచి ముప్పు పొంచిఉండటంతో అత్యాధునిక ఆయుధాలను భారత్‌ తరలిస్తున్నది. 
 
ఇందులోభాగంగా భారత వాయుసేన తాజాగా చైనా, పాక్‌ సరిహద్దుల్లో శత్రు క్షిపణుల అంతుతేల్చే మూడు ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ స్క్వాడ్రన్లను మోహరించింది. రష్యానుంచి అందాల్సిన మరో రెండు స్కాడ్రన్లపై మాస్కోతో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని కూడా ఓ వార్తా సంస్థ కథనంలో వెల్లడించారు.
 
ఇవి గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలుగుతాయి. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఈ క్షిపణి వ్యవస్థ అండగా నిలుస్తుంది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఎస్‌-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేస్తుంది. ఏకకాలంలో 36 లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. భారత్ దాదాపు రూ.35 వేల కోట్లు వెచ్చించి ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు 2018 19లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఐదు రెజిమెంట్లను మనదేశం అందుకోనుంది. ఇప్పటికే మూడు రెజిమెంట్లు మన దేశానికి చేరుకున్నాయి. 

ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా మిగతా రెండు రెజిమెంట్ల డెలివరీ ఆలస్యమయింది. భారత్‌కు చేరిన మూడు రెజిమెంట్లలో ఒకదానిని చైనా-పాక్ సరిహద్దుల్లో నిఘా వేసి ఉంచేలా, మిగతా రెండింట్లో ఒక్కోదానిని పాక్, చైనా సరిహద్దుల్లోని కీలక సెక్టార్లలో వేర్వేరుగా మోహరించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

మిగతా రెండు రెజిమెంట్లకు సంబంధించి డెలివరీలపై రష్యా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత అధికారులు సిద్ధమయ్యారు. నిజానికి ఈ రెండు రెజిమెంట్లను కచ్చితంగా ఎప్పుడు అందిస్తామో చెప్పలేని స్థితిలో రష్యా ఉంది. ఇప్పటికే భారత్ కోసం తయారు చేసిన ఎస్ 400 రెజిమెంట్లను అది ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సమాచారాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. తమకు రావలసిన వ్యవస్థలను ఎలా పొందాలనే దానిపైనే తాము దృష్టి పెడుతున్నామని ఆ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్, చైనాలనుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరితం బలోనేతం చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రాజెక్ట్ కుశ కింద భారతీయ లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థను సమకూర్చుకోవడానికి భారత రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఇటీవల ఆమోదం తెలిపింది.