టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇప్పుడా కేటీఆర్!

గత మార్చ్ 12న టీఎస్పీఎస్సీ స్కాం వెలుగులోకి వస్తే, ఇప్పుడు ఎన్నికల తర్వాత దానిని ప్రక్షాళన చేస్తాం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దొంగలు పడ్డ ఆరు నెలలకు ఎఫ్ఐఆర్ వేసిన చందంగా ఉందని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  ఎన్నికల వేళ ప్రజల్లో యువతలో వస్తున్న వ్యతిరేకతను చూసి బయపడి పోలింగ్ పూర్తయ్యాక డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటూ యువతను, నిరుద్యోగులను మళ్లీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పగటి కలలు కంటున్నా కేటీఆర్ నిన్ను నీ కుటుంబాన్ని ప్రజలు ఫామ్ హౌస్ కి పరిమితం చేయనున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి రోజ్ గార్ మేళాల ద్వారా కేంద్రం లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఎలా చేస్తుందో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ప్రకటించారు.

కేటీఆర్ మీకు చిత్తశుద్ధి ఉంటే, ఉద్యోగాలు భర్తీ చేయాలన్న తపన ఉంటే, నిరుద్యోగులకు కొలువులు ఇవ్వాళ్లన్న ఆరాటం ఉంటే సిట్ విచారణలో మీ ప్రభుత్వ పాపాలపుట్ట, అసమర్థత బద్ధలైనప్పుడయినా టీఎస్పీపీఎస్సీ ప్రక్షాళన చేసేవారని చెప్పారు. కానీ అవేవి పట్టించుకోకుండా లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ కు కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదని,  రకరకాల సాకులతో నియామకాలను జరపకుండా వీలైనంత కాలయాపన చేయడం అంటూ ధ్వజమెత్తారు. ఒకవేళ నియామకాలు అంటూ జరిపితే అక్రమాలకు తెరలేపడం పేర్కొంటూ ప్రభుత్వ వైఫల్యం వల్లే 30 లక్షల మంది యువత కుటుంబాలు నిరాశలో కూరుకుపోయాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్స్ అభ్యర్థుల ఆత్మహత్యలకు కారణం ముమ్మాటికి ఈ ప్రభుత్వ  పాపమే అని స్పష్టం చేశారు. రాజధాని నగరం నడిబొడ్డున గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం మీ పాపం కాదా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. దాన్ని తొక్కిపెట్టేందుకు లేని విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వంకర మాటలు మాట్లాడి మీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది మీరు కాదా? అంటూ నిలదీశారు.

ఈ మధ్య మెట్ పల్లికి చెందిన మరో యువకుడు రెహమత్ కూడా గ్రూప్ 1, 2 పరీక్షలు వాయిదా పడ్డాయని ఆత్మహత్య చేసుకుంటే మీ అధికారాన్ని ఉపయోగించి దానిని తొక్కిపెట్టడం వాస్తవం కాదా? అంటూ రికార్డు స్థాయిలో  17 సార్లు పరీక్షల్ని వాయిదా వేసిన రికార్డ్ పాలనా ఈ ప్రభుత్వంది అని మండిపడ్డారు.