టిటిడిపికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలకు టి టిడిపి దూరంగా ఉండడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.  ఇటీవల రెండో సారి ఆయన చంద్రబాబును కలిసి పోటీ చేస్తామంటూ సుమారు 75 మంది జాబితాను అందజేశారు. అధినేత ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికలకు వద్దే వద్దని చెప్పడంతో తీవ్ర నిరాశతో ఆయన వెనుదిరిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అంతా సిద్ధం చేసుకున్నాక, పోటీ చేయవద్దని చంద్రబాబు చెప్పారని, ఈ నిర్ణయం తనను చాలా బాధించిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయల్లేదని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పలేనని, అందుకే రాజీనామా చేశాననీ కాసాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడటానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని కాసాని అసహనం వ్యక్తం చేశారు.

అధినేత చంద్రబాబు కోరితేనే ఖమ్మం మీటింగ్ పెట్టానని ఆయన తెలిపారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో మీటింగ్ పెట్టాలన్నారని, ఇంటింటికీ టి టిడిపి అని 41వార్డు ఆవిర్భావ సభ పెట్టించారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదని చెప్పారని తెలిపారు. 

తనను ఎందుకు పార్టీలోకి పిలిచినట్లు, ఇప్పుడు ఎందుకు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన చేయడం లేదని చంద్రబాబును అడిగానని పేర్కొన్నారు. ఇప్పటికే 60 నుండి 75 మంది వరకు అభ్యర్థులు తయారయి ఉన్నారని చెబుతూ ఎందుకు అభ్యర్థులను పోటీ చేయించటం లేదో చంద్రబాబు చెప్పడం లేదని ధ్వజమెత్తారు. మరో వైపు నారా లోకేశ్  చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు పట్టింపు లేదని మండిపడ్డారు.

ఆంధ్రలో టిడిపి జనసేనతో పొత్తు .. తెలంగాణలో అదే జనసేన, బిజెపితో పొత్తు… ఇదేం బొమ్మలాట? అని కాసాని ప్రశ్నించారు.  నందమూరి బాలకృష్ణ కూడా ఎన్‌టిఆర్ భవన్ కి వచ్చారని, తడాఖా చూపిద్దాం అని చెప్పారని… ఇప్పుడు బాలయ్య కూడా పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యడం లేదని వాపోయారు.

 తాను చిల్లిగవ్వ కూడా పార్టీ నుంచి తీసుకోలేదని, అన్నిటికీ తానే ఖర్చు చేశానని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వీటి గురించి అడిగితే తెలంగాణతో తనకు సంబంధం లేదు అని నారా లోకేశ్ అన్నాడట.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండడం అవసరమా? అని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో చిన్నా చితక పార్టీలన్నీ పోటీకి దిగి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఎన్నికల చరిత్ర ఉన్న టీడీపీని పోటీకి నిలపకవడంతో ఆత్మహత్య వంటిదే అన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.

లోపాయికారిగా తెలంగాణలో కాంగ్రెస్ కు మేలు చేసేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కాంగ్రెస్ కు సహకరించేందుకే చంద్రబాబు నాయుడు, లోకేష్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో పార్టీని బొందపెట్టడమేనని టీడీపీ తెలంగాణ శ్రేణులు మదనపడుతున్నారు.