విద్యార్థుల జీవితాలకు దిక్సూచిగా అధ్యాపకులు

విద్యార్థుల జీవితాలకు అధ్యాపకులు దిక్సూచిగా నిలుస్తారని ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్సలర్, గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా ఒకే సారి 1024 మంది విద్యార్థులు పిహెచ్‌డి పట్టా పొందే ఘట్టానికి ఠాగూర్ ఆడిటోరియం వేదికగా నిలిచింది.

విశ్వవిద్యాలయ పరిధిలో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మరో 58 మంది విద్యార్థులు వర్శిటీ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఉస్మానియా క్యాంపస్ లోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన అడోబ్, అధ్యక్షుడిగా, ముఖ్య కార్యనిర్వహణాధికారి స్థాయికి ఎదిగిన శంతను నారాయణ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 

గవర్నర్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గతేడాది భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ గౌరవ డాక్టరేట్ అందుకున్న విషయం తెలిసిందే. ఓయూ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రొఫెసర్ దండబోయిన రవిందర్ యాదవ్ నాయకత్వంలో వరుసగా మూడో ఏడాది స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. 

పిహెచ్‌డి పూర్తి చేసిన 1,024 మంది విద్యార్థులు ముఖ్య అతిథి శంతను నారాయణ్, ఉపకులపతి ఆచార్య రవిందర్ యాదవ్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై మాట్లాడుతూ వరుసగా మూడు సంవత్సరాలు స్నాతకోత్సవం నిర్వహించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా విద్యాసంస్థలు స్నాతకోత్సవాలు జరుపుకోవాలని సూచించారు. 

ఎంతో మంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకు తలవంచి నమస్కరిస్తున్నాని పేర్కొంటూ విద్యార్థుల జీవితాలకు అధ్యాపకులు దిక్సూచిగా నిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు. జీవితం సవాళ్లతో కూడుకుంటుందని, ప్రతి సవాల్ ను అధిగమించినప్పుడే అద్భుతాలు సృష్టించగలమని గవర్నర్ తెలిపారు. ఎలాంటి సందర్బంలోనైనా అత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ఆమె సూచించారు. ప్రతి సందర్భంలోనూ ధైర్యంతో, సంతోషంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.