కరోనా రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది

కరోనా రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది
యువ‌త‌లో గుండె పోటు మ‌ర‌ణాలు ఇటీవ‌లే పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్‌తో ఎంద‌రో యువ‌కులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్కవుట్స్‌ చేస్తున్న సమయంలో కూడా చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఇక వారం కిందట దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌ లో నిర్వహించిన గార్బా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న10 మంది గుండెపోటుతో మరణించారు. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక సూచన చేశారు. 
 
కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఒకటి నుంచి రెండేళ్ల వరకూ ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని సూచించారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించారు.
 
 ‘ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఆ తర్వాత రెండేళ్ల వరకూ ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిది. అప్పుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు’ అని మాండవీయ చెప్పారు.