ఖతార్‌లో ఉరిశిక్ష పడిన అధికారుల కుటుంబాల పరామర్శ

ఖతార్‌లో గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 8 మంది అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ వెల్లడించారు. 

సోమవారం ఆయన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కష్టకాలంలో అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 

“ఖతార్‌లో నిర్బంధించబడిన 8 మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు వారికి తెలియజేశా. బాధిత కుటుంబాల ఆందోళనలు, ఆవేదనలు, బాధలు మాకు పూర్తిగా అర్థమవుతున్నాయి. వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు తెలియజేస్తాం” అని ఆయన ట్వీట్‌ చేశారు.

గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  ఖతార్‌లో ఉరిశిక్షపడిన మాజీ నేవీ అధికారులు గతంలో భారత యుద్ధనౌకలకు నాయకత్వం వహించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ ‘దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్‌’లో పనిచేస్తున్నారు.

భారత మాజీ అధికారులు కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కెప్టెన్‌ సౌరభ్‌, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, కమాండర్‌ తివారీ, కమాండర్‌ సుగుణాకర్‌ పాకాల, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, సెయిలర్‌ రాగేశ్‌లపై ఇజ్రాయెల్‌ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.  ఇజ్రాయెల్‌ తరఫున వీరంతా ఓ సబ్‌మెరైన్‌ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలు నమోదయ్యాయి.

దీంతో ఆ 8 మంది అధికారులను ఖతార్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అరెస్టు చేసింది. ఈ కేసులో వారు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ కేసులో తమ వద్ద ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాధారాలు ఉన్నాయని ఖతార్‌ అధికార యంత్రాంగం చెబుతున్నది. దీంతో వీరికి మరణశిక్ష విధిస్తూ “కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ ఆఫ్‌ ఖతార్‌” ఇటీవలే తీర్పు వెలువరించింది.