తెలంగాణ ఎన్నికలకు దూరంగా టిడిపి

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నించినా టిడిపి తీరా ఎన్నికల సమయానికి చేతులెత్తేసింది. ముఖ్యంగా టీడీపీలో చేరి, రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ నుండి రాష్ట్రంలో పార్టీ ఉనికి నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రముఖ బిసి నేత కాసాని జ్ఞానేశ్వర్‌ ఈ పరిణామంతో దిగ్బ్రాంతికి గురైన్నట్లు తెలుస్తున్నది.
 
ఈ విషయమై స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో రాజముండ్రి జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసిన జ్జానేశ్వర్ ఈ విషయమై చర్చించి, ఆయనను ఒప్పించేందుకు విఫల ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది.  ఇప్పుడు వైఎస్ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని చంద్రబాబు స్పష్టం చేశారని చెబుతున్నారు.
 
తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కోరడమే కాకుండా 83 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన్నట్లు కూడా జ్జ్ఞానేశ్వర్ తెలిపారు. పైగా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణాలో టీడీపీ ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.
 
‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్‌ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే మే నెలలో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. ఏపీలో విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. ఈ విషయాలపై మీరూ ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
ఏపీలో వైఎస్ జగన్ కు అండగా ఉంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో హోరాహోరీగా పోరాడుతున్న సమయంలో టిడిపి ఇక్కడ పోటీచేస్తే ప్రభుత్వ వ్యహాతిరేక ఓట్లను చీల్చి, బిఆర్ఎస్ కు ప్రయోజనం కలిగిస్తుందనే టీడీపీ వెనుకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా, రేవంత్ రెడ్డికి ఇప్పటికి చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నది అందరికి తెలిసిందే.
 
2018 ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బొక్కబోర్లా పడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమైనట్లు స్పష్టం అవుతుంది. తెలంగాణాలో టిడిపి పోటీలో ఉండరాదని నారా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు వంతపాడుతున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి రాష్ట్రం విడిపోవడంతోనే తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్లైంది. ఆ పార్టీలో నేతలు క్రమంగా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం నుండి ఏ ఎన్నికలో కూడా ఆ పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోతుంది.  ఇప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో అభిమానులు ఉన్నప్పటికీ ఎట్లాగూ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనుకుంటా వారు టీడీపీకి ఓటు వేస్తున్న దాఖలాలు లేవు.