
దేశంలో రాజకీయ కలకలం రేపుతున్న ‘ప్రశ్నకు డబ్బు’ వ్యవహారంలో తన పార్లమెంట్ లాగిన్ క్రెడిన్షియల్స్ను ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హిరానందానికి తాను ఇచ్చినట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మొదటిసారిగా ఒప్పుకున్నారు. ప్రశ్నలు పోస్ట్ చేసేందుకు అతనికి ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చానని ఆమె తెలిపారు.
అయితే, తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణల్ని మాత్రం ఖండించారు. తనకు దర్శన్ నుంచి బహుమతిగా ఒక కండువా, కొన్ని లిప్స్టిక్స్, ఐ షాడో తో పాటు కొన్ని మేకప్ వస్తువులు లభించాయే తప్ప పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు అతని నుంచి డబ్బులు తీసుకోలేదని స్పష్టత ఇచ్చారు. కాగా, అతడ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
పార్లమెంటులో అదానీ, ప్రధాని మోదీపై ప్రశ్నలు అడిగినందుకు గాను దర్శన్ హిరానందాని నుంచి భారీ మొత్తంలో డబ్బులతో పాటు బహుమతులు అందుకున్నారన్న ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత మహువా మోయిత్రా పై విధంగా స్పందించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆమెపై ఈ ఆరోపణలు గుప్పించారు.
మొదట్లో ఈ ఆరోపణల్ని మోయిత్రా ఖండించలేదు కానీ, తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ వచ్చారు. దూబే డిగ్రీలు నకిలీ అని వాదించారు. అలాగే, అఫిడవిట్లో హిరానందానితో బలవంతంగా సంతకం చేయించారని, ఆ అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్ హెడ్ రూపంలో లేదని కూడా ఆమె ప్రశ్నించారు.
హీరానందనికి సిబిఐ లేదా ఎథిక్స్ కమిటీ లేదా ఏ దర్యాప్తు సంస్థ ఇంకా సమన్లు జారీ చేయలేదని ఆమె నిలదీశారు. తాజాగా మాత్రం తాను అతనికి తన పార్లమెంటరీ లాగిన్ ఐడీ, పాస్వర్డ్స్ ఇచ్చినట్టు మోయిత్రా అంగీకరించారు. ప్రశ్నకు డబ్బు ఆరోపణలతో పాటు అఫిడవిట్ అందిన నేపథ్యంలో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మోయిత్రాకు సమన్లు జారీ చేసింది.
అక్టోబర్ 31న తన వాదనను సమర్పించాలని ఆదేశించింది. అయితే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులున్న కారణంగా తనకు మరింత సమయం కావాలని ఆమె అభ్యర్థించింది. అయితే ఆ నోటీసులు తనకు అందేముందే మీడియాలో లీక్ అయిందని, టీవీల్లో ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఆమె ఎథిక్స్ కమిటీకి లేఖ రాసింది.
30 నుంచి నవంబర్ 4 వరకు తన నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల వల్ల తాను విచారణకు రాలేనని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. తన విచారణ తేదీ మార్చాలని ఆమె ఆ లేఖలో కోరారు. అయితే ఆమె కోరుకున్నట్టుగా నవంబర్ 4వరకు కాకుండా, నవంబర్ 2వ తేదీన కమిటీకి తన వాదనల్ని సమర్పించాలని ఈ మేరకు ఆమెకు సమన్లు పంపింది. ఇకపై విచారణ తేదీ మార్చడం కుదరదని కమిటీ స్పష్టం చేసింది.
మరోవంక, ఎథిక్స్ కమిటీలోని చాలామంది సభ్యులు మోయిత్రాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని మండిపడ్డారు. ఇది పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, ఢిల్లీకి చెందిన న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ సైతం ఇప్పటికే మోయిత్రాకు వ్యతిరేకంగా తమ వాంగ్మూలాలను ఎథిక్స్ కమిటీకి అందజేశారు.
కాగా, హిరానందానితో ఆమె లాగిన్ క్రెడెన్షియల్స్ పంచుకోవడాన్ని ఆమె సమర్థించారు. తాను రిమోట్ నియోజకవర్గం నుంచి పని చేస్తున్నందున ఇతరుతోనూ ఆ క్రెడెన్షియల్స్ షేర్ చేసినట్లు తెలిపారు. తన బృందం కూడా తనకు ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసి కూడా దీనికి వ్యతిరేకంగా ఎటువంటి నియమాలు పెట్టలేదని ఆమె చెప్పారు.
More Stories
పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష