ఇజ్రాయెల్ దళాల అష్టదిగ్బంధనంలో గాజా

ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో గాజాలో తక్షణ మానవతా సంధికి పిలుపిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక వైపు తీర్మానం ఆమోదించగా, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ స్థావరాలుగా అనుమానిస్తున్న ప్రాంతాలపై శతఘ్ని గుళ్లవర్షం కురిపించడంతో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ ధ్వంసమై గాజా ప్రాంతానికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

సుమారు వంద ఫైటర్ జెట్స్‌తో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ గిలాడ్ కీనన్ తెలిపారు. గాజా ఉత్తర ప్రాంతానికి ఇజ్రాయెల్ దళాలు లక్షంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌కు చెందిన ఊపును ఇజ్రాయెల్ ఆర్మీ క్రమేపీ పెంచుతున్నట్లు ఈ దాడులతో స్పష్టమవుతోంది.

కాగా, గాజాలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిపా కేవలం ఆస్పత్రి మాత్రమే కాదని, హమాస్ మిలిటెంట్ల ప్రధాన కార్యాలయం కూడానని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనికి సంబంధించి నిఘా వర్గాల ఆధారిత ఓ యానిమేటెడ్ వీడియోను ‘ఎక్స్’ వేదికగా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఆసుపత్రి భవనం కింది భాగంలో ఓ నివాసం ఉన్నట్లు వీడియోలో చూపించింది. గాజాలోని రహస్య ఉగ్రవాద స్థావరాలను బట్టబయలు చేస్తామని ఐడిఎఫ్ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి దాదాపు నాలుగు గంటల పాటు వైమానిక దాడులు, పేలుళ్లతో గాజా నగరం దద్దరిల్లిపోయింది. 

ఈ దాడులతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని పాలస్తీనాలో టెలికాం సేవలను అందించే పాల్‌టెల్ సంస్థ తెలిపింది. ఇంటర్‌నెట్, సెల్యులార్, ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులన్నీ పూర్తిగా ఆగిపోయాయి.  కొన్ని శాటిలైట్ ఫోన్లు మాత్రం పని చేస్తున్నాయి. టెలిఫోన్ వ్యవస్థ కుప్పకూలిపోవడంతో మృతుల వివరాలు వెంటనే తెలుసుకోవడం కష్టమవడమే కాకుండా, ఆస్పత్రుల్లో వైద్య సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల కారణంగా కొన్ని వారాలనుంచే చీకటిలో మగ్గుతున్న పాలస్తీనియను ఇప్పుడు టెలిఫోన్ సర్వీసులు కూడా లేకపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా కోల్పోయి ఆహారం, తాగు నీటి సరఫరాలు కూడా నిండుకు పోవడంతో ఇళ్లు, షెల్టర్లలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఏ క్షణంలో ఎటువైపునుంచి బాంబులు, రాకెట్లు వచ్చి పడతాయోనని భయంతో వణికిపోతున్నారు. కాగా శుక్రవారం రాత్రి అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ మిలిటెంట్లకు మధ్య వీధి పోరాటాలు కొనసాగాయని హమాస్ మీడియా సెంటర్ తెలియజేసింది. గాజా తూర్పు ప్రాంతంలోని బురీజ్ శరణార్థి శిబిరంపైన కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు ఆ మీడియా తెలిపింది.