కాశీ విశ్వనాథ ఆలయంలో సంప్రదాయ వస్త్రధారణ!

కాశీలోని విశ్వనాథ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు నిర్థిష్ట వస్త్రధారణ నిబంధన విధించే ఆలోచన ఉంది. ఈ ప్రతిపాదనపై తమ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు కాశీ విశ్వనాథ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు నాగేంద్ర పాండే తెలిపారు.  కాశీకి శివ దర్శనానికి వచ్చే భక్తులకు వస్త్రధారణ నిబంధన విధించాలనే ప్రతిపాదన అయితే ఉంది.

కానీ ఇది అనుకున్నంత తేలిక విషయం కాదని, సంక్లిష్ట అంశమని తెలిపిన పాండే దీనిపై నిర్ణయానికి ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చే వివిధ వర్గాలు, ఆచార వ్యవహారాల వారి మనోభావాలను లెక్కలోకి తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ఉండే కార్యక్షేత్రస్థాయి సమస్యలను కూడా విశ్లేషించుకోవల్సి ఉంటుందని వివరించారు. 

దేశంలో ఇతర దేవాలయాల్లో అమలు అవుతున్న డ్రస్సు కోడ్ గురించి ముందుగా పరిశీలించుకోవల్సి ఉంటుందని పాండే తెలిపారు. అయితే శివుడి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా వస్త్రధారణ నిబంధన ఉండాలని స్థానికులు, భక్తులు, మీడియాకు చెందిన వారి నుంచి కూడా చిరకాలంగా ఓ వాదన విన్పిస్తోందని తెలిపిన ఛైర్మన్ దీనిని నవంబర్‌లో జరిగే కమిటీ భేటీలో పరిశీలిస్తామని చెప్పారు. 

దర్శనానికి వచ్చే మగవారికి ధోవతి, కుర్తా, మహిళలకు చీర ఆచారం విధించాలని ఓ ప్రతిపాదన వెలువడింది. ఇప్పటికైతే కాశీకి వచ్చే భక్తులకు ఆలయ సందర్శన దశలో ఎటువంటి డ్రస్సు కోడ్ అమలులో లేదు. కాగా, దక్షిణాదిన తిరుమల తదితర ప్రసిద్ధ దేవాలయాలలో సాంప్రదాయ వస్త్రధారణను తప్పనిసరి చేశారు.