పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి… సెమీస్ ఆశలు గల్లంతు

పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి… సెమీస్ ఆశలు గల్లంతు
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్‍కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో చిత్ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్‍లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది.
 
ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్‍లు ఓడిపోవటం పాకిస్థాన్‍కు ఇదే తొలిసారి. ఈ ప్రపంచకప్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచిన పాక్.. వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో పరాజయం చెందింది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ దాదాపు ఔట్ అయినట్టే. ఆరు మ్యాచ్‍ల్లో నాలుగింట ఓడి ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాక్ ఉంది. ఇంకా గ్రూప్ స్టేజీలో బాబర్ ఆజమ్ సేన మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‍లు గెలిచినా.. పాకిస్థాన్ సెమీస్‍కు చేరడం దాదాపు అసాధ్యమే.

271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది దక్షిణాఫ్రికా. ఐడెన్ మార్క్‌రమ్ (91) అదరగొట్టడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి టెన్షన్‍లో పడింది. చివర్లో కేశవ్ మహారాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేసి సఫారీ జట్టును గెలిపించాడు. దీంతో ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిది మూడు, హరిస్ రవూఫ్, మహమ్మద్ వాసిమ్, ఉసామా మిర్ చెరో రెండు వికెట్లు తీశారు. చివరి వరకు పోరాడి ఓడింది పాక్. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.  బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (52) అర్ధ శతకాలు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ తబ్రైజ్ షంసి నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లతో రాణించాడు.