31న లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ ఎంపీ మహువా విచారణ

పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ అక్టోబర్‌ 31న తమ ఎదుట హాజరు కావాలని మహువాను కోరింది.  మహువా మొయిత్రీకి వ్యతిరేకంగా వచ్చిన ఈ ఆరోపణలు ‘చాలా తీవ్రమైనవి’ గా కమిటీ భావించినట్లు  సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
ఆరోపణలపై గురువారం ఎథిక్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు హోం, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి సహాయం తీసుకుంటుందని బిజెపి ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ తెలిపారు. సమావేశం తర్వాత 31న ప్యానెల్ ముందు హాజరు కావాలని ఎంపీని కోరినట్లు ఆయన తెలిపారు.
 
సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో కమిటీ  బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహద్రారు వాదనలను విన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. మొయిత్రీపై వచ్చిన ఆరోపణలకు  సంబంధించి  ప్రతి అంశాన్ని చర్చించినట్లు పేర్కొన్నాయి. లోతైన దర్యాప్తు కోసం కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వివరాలు కోరుతూ సమాచార మంత్రిత్వ  శాఖకు, హోం మంత్రిత్వ శాఖకు లేఖలు పంపినట్లు వినోద్‌ సోంకర్‌ మీడియాకు తెలిపారు.
 
 ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై విమర్శలు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నట్లు నిషికాంత్‌ దూబే ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 
 

దీంతో ఆయన ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేశారు. ఈ క్రమంలో ఎథిక్స్‌ కమిటీ విచారణ జరుపుతున్నది. అయితే, మహువా మోయిత్రా ఈ ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపడేశారు. తన పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ బిజెపి ఎంపీతో పాటు దేహద్రాయ్‌పై పరువు నష్టం కేసును దాఖలు చేశారు.