సరిహద్దుల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పొరుగు దేశం పాక్‌ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చివేశాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్‌ వద్ద నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు కొందరు ముష్కరులు ప్రయత్నించారు. 
 
అయితే ఉగ్రవాదుల కుట్రలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి ఆ కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో రెండు వైపుల నుంచి చోటు చేసుకున్న కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ ఐదుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు జమ్మూ కాశ్మీర్‌ అడిషనల్ డీజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఆపరేషన్‌ కొనసాగుతోందని తెలిపారు.
 
కుప్వారాలోని నియంత్రణ రేఖ దగ్గర నిర్ధిష్ట సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్ తెలిపింది. ఈ విషయమై డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ ఆర్మీ, పోలీసులతో ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి చొరబాటు కోసం ఉగ్రవాదులు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 16 లాంచింగ్ ప్యాడ్‌లు తయారు చేసినట్లు అంచనా. సైన్యం, పోలీసులు సరిహద్దులో పూర్తిస్థాయిలో పటిష్టమైన నిఘా వేసింది. ఇదిలా ఉండగా.. శని, ఆదివారాల్లోనూ పాక్‌ నుంచి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.