గాజా సంక్షోభంతో జమ్మూ కశ్మీర్‌లో భద్రతపై అప్రమత్తం

గాజా సంక్షోభం కారణంగా జమ్మూ కశ్మీర్‌లో వీధి నిరసనలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాన్ని ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ తీవ్రవాదుల సంఖ్య పెరగడం సహా భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సంక్షోభం ప్రేరేపించింది. 

ఈ నేపథ్యంలో  శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘భేటీలో కొత్త భద్రతా వ్యూహం గురించి చర్చించాం.. రాబోయే రోజుల్లో వీధి నిరసనలు ఏవైనా ఉంటే వాటిని ఎలా అరికట్టాలనే దానిపై దృష్టి కేంద్రీకరించాం’ అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. 

సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. గాజాలో జరుగుతున్న పరిణామాలను కశ్మీరీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ‘కొన్నిచోట్ల వీధి నిరసనలు జరగవచ్చని మేము భయపడుతున్నాం.. ఫలితంగా శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి, పరిస్థితిని అదుపులో ఉంచడానికి కొత్త వ్యూహాల గురించి చర్చించాం’ అని ఆయన వివరించారు. 

2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి వీధి నిరసనలు గణనీయంగా తగ్గాయి. ఇది సమన్వయంతో కూడిన ప్రయత్నాల ఫలితమని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఈ అత్యున్నత సమావేశంలో చర్చించిన మరో అంశం విదేశీ ఉగ్రవాదులు పోషించే పాత్ర. స్థానిక రిక్రూట్‌మెంట్లు బాగా తగ్గిపోవడంతో విదేశీ ఉగ్రవాదుల సంఖ్య మళ్లీ పెరిగిందని మరో అధికారి తెలిపారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకూ కశ్మీర్ లోయలో 46 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా, 37 మంది పాకిస్థానీలు, కేవలం 9 మంది మాత్రమే స్థానికులని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక తీవ్రవాదుల కంటే నాలుగు రెట్ల ఎక్కువ విదేశీ ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లలో హతమవడం 33 ఏళ్లలో ఇదే మొదటిసారి.

కేంద్ర హోం శాఖ నివేదిక ప్రకారం లోయలో ప్రస్తుతం 130 మంది ఉగ్రవాదులు ఉండగా, వీరిలో సగం మంది విదేశీ ఉగ్రవాదులే. ‘కశ్మీర్‌లో ప్రశాంతతను భగ్నం చేయడానికి ఉగ్రవాదులను పెద్ద సంఖ్యలో పాకిస్థాన్ ఎగదోస్తోంది.. ఎగువ ప్రాంతాల్లో తలదాచుకున్న వారు కూడా లోయలోకి వస్తారేమోనని భయపడుతున్నాం’ అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

ఇక, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహదారు ఆర్ఆర్ భట్నాగర్ అధ్యక్షతన జరిగిన శ్రీనగర్‌ సమావేశంలో నార్తర్న్ కమాండ్ కమాండర్ ఉపేంద్ర ద్వివేది, డీజీపీ దిల్బాగ్ సింగ్, చీనార్ కార్ప్స్ కమాండర్, ఆర్మీకి చెందిన ఇతర ఉన్నతాధికారులు, సెక్యూరిటీ సంస్థలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. శీతాకాలం ప్రారంభానికి సంబంధించి ఈ ప్రాంతంలో భద్రతా అంశాలు కూడా చర్చకు వచ్చాయని మరో అధికారి తెలిపారు.