
అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి వచ్చే ఏడాది జనవరి 22న ముహూర్తం నిర్ణయించారు. కింది అంతస్తు నిర్మాణ పనులు ముందుగా పూర్తి చేసి శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరోవైపు, రామమందిర తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
గోడలు, ద్వారాలపై శిల్ప కళ ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులకు సంబంధించిన వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ. ‘500 ఏళ్ల పోరాటానికి ముగింపు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. మొత్తం 30 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రామాలయానికి శిల్పలు తుది మెరుగులు దిద్దుతుండటం కనిపిస్తుంది.
‘అయోధ్య పిలుస్తోంది’ అనే నేపథ్య సంగీతంతో రూపొందించిన వీడియోలో ఆలయంలోని ద్వారాలు, గోపురం, స్తంభాలు, ఫ్లోరింగ్‌తోపాటు మందిర నిర్మాణానికి ఉపయోగించిన భారీ యంత్రాలు ఉన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన మర్నాడే ఈ వీడియోను విడుదల చేయడం విశేషం.
రామ మందిరంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది ఆధ్యాత్మికవేత్తలు, నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత ఆయన ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది.
మూడంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు. సుప్రీంకోర్టు 2019 నవంబరులో అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఆగస్టు 2020లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
More Stories
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
దేశంలో ర్యాగింగ్ మరణాల సంఖ్య 2020- 2024లో 51
ఈ నెల 29న సూర్యగ్రహణం