అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మైన్‌ రాష్ట్రంలోని లెవిస్టన్‌ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్‌ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్‌ యాలీ, మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. 
కాల్పుల నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు.
 
అమెరికాలోని ఈశాన్య రాష్ట్రం మెనేలో ఈ లీవిస్టన్ నగరం ఉంది. ఈ నగరంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో ఉన్న బౌలింగ్ అలీలో రాబర్ట్ కార్ట్ ఈ కాల్పులకు  తెగబడ్డారు. అనంతరం, పక్కనే ఉన్న వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రాబర్ట్ కార్డ్ ఈ కాల్పులు జరపడానికి కారణం తెలియరాలేదు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, రాబర్ట్ కార్డ్ తో ప్రమాదం పొంచి ఉందని, అతడి వద్ద ఆయుధం ఉందని, అందువల్ల పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు సూచించారు. వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేసి, షట్టర్స్ క్లోజ్ చేసుకోవాలని సూచించారు. ఆ కాల్పులకు పాల్పడిన రాబర్ట్ కార్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతడి వద్ద సెమీ ఆటోమేటిక్ గన్ ఉన్నట్లు తెలిపారు.
 
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మెనే రాష్ట్ర గవర్నర్ జానెట్ మిల్స్ తో, ఇద్దరు సెనేటర్లతో మాట్లాడారు. ఫెడరల్ నుంచి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.  గత సంవత్సరం మే 22 న కూడా అమెరికాలో మాస్ షూటింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు టెక్సస్ లోని ఉవాల్డేలో ఉన్న ఒక ఎలిమెంటరీ పాఠశాలలో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మంది ప్రాణాలు తీశాడు. కొరోనా అనంతరం అమెరికాలో మాస్ షూటింగ్ ఘటనలు పెరిగాయి.