పశ్చిమాసియాలో ప్రాణ నష్టంపై భారత్‌ ఆందోళన

ఇజ్రాయిల్‌ – పాలస్తీనా  వివాదంతో పశ్చిమాసియాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాణ నష్టంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి స్థాపనకు అవసరమైన పరిస్థితులను కల్పించేందుకు,   హింసను ఆపి ప్రత్యక్ష చర్చలను పున: ప్రారంభించేందుకు ఇరుదేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసలో భారత ఉప శాశ్వత ప్రతినిధి ఆర్‌.రవీంద్ర  మాట్లాడుతూ ప్రాణ నష్టం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు.  పెరుగుతున్న మానవతా సంక్షోభం కూడా అంతే భయంకరంగా ఉందని పేర్కొన్నారు. 

ఇరుపక్షాల దాడుల్లో పౌర మరణాలు ఆందోళనకరమని చెబుతూ ఇరు పక్షాలు పౌరులకు ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలని కోరారు. గాజాలో మానవతా సంక్షోభానికి తెరదించాలని విజ్ఞప్తి చేశారు. శాంతికి అవసరమైన పరిస్థితులను కల్పించేందుకు, తీవ్రతరం చేసేందుకు హింసను నివారించడం ద్వారా ప్రత్యక్ష చర్చలను పున: ప్రారంభించడం కోసం కృషి చేయాలని ఇరు పక్షాలను ఆయన కోరారు.

హ‌మాస్ టాప్ క‌మాండ‌ర్ ముబాష‌ర్ హ‌తం

ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాల దాడుల్లో హ‌మాస్ నార్త్ ఖాన్ యూనిస్ బెటాలియ‌న్‌కు చెందిన క‌మాండ‌ర్ తైసిర్ ముబాష‌ర్ బుధవారం హ‌త‌మ‌య్యాడు. గ‌తంలో హ‌మాస్ నేవీ ద‌ళానికి ముబాషర్ హెడ్‌గా చేశాడ‌ని ఐడీఎఫ్ తెలిపింది. హ‌మాస్ ఉగ్ర‌వాద గ్రూపుకు చెందిన వెప‌న్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్‌లో అనేక కీల‌క ప‌దవుల‌ను అత‌ను చేప‌ట్టాడు.
 
మిలిట‌రీలో ముబాష‌ర్‌కు విస్తృత‌మైన అనుభ‌వం ఉంద‌ని, క‌మాండ‌ర్‌గా ఉగ్ర‌దాడుల‌కు ప్లాన్ వేశాడ‌ని ఐడీఎఫ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 2002లో అజ్మోనా ప్రీమిలిట‌రీ అకాడ‌మీలో జ‌రిగిన పేలుడుకు ప్ర‌ధాన సూత్ర‌ధారి ముబాష‌ర్ అని ఐడీఎఫ్ తెలిపింది. 2005లో గాజా స్ట్రిప్ వ‌ద్ద జ‌రిగిన దాడుల‌కు కూడా సూత్ర‌ధారి అని ఐడీఎఫ్ వెల్ల‌డించింది.
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో 305 మంది చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. హమాస్‌ కమాండర్లు, తీవ్రవాదులే లక్ష్యంగా గత 24 గంటల్లో 400 వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.
 
సోమ‌వారం రాత్రి నుంచి కొన‌సాగుతున్న దాడుల్లో డ‌జ‌న్ల కొద్దీ హ‌మాస్ ఫైట‌ర్ల‌ను మ‌ట్టుబెట్టామ‌ని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో ముగ్గురు డిప్యూటీ బెటాలియ‌న్ క‌మాండ‌ర్లు ఉన్నార‌ని వెల్ల‌డించింది. స‌ముద్రం నుంచి సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకువ‌చ్చేందుకు హ‌మాస్‌కు స‌హ‌క‌రించే ట‌న్నెల్‌తో పాటు మ‌సీదుల్లో హ‌మాస్ క‌మాండ్ సెంట‌ర్ల‌ను ధ్వంసం చేశామ‌ని పేర్కొంది.