వరవరరావుకు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి

ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్ట్‌ సంబంధాల కేసులో నిందితుడైన విప్లవ రచయిత వరవరరావుకు సుమారు ఐదేళ్ల అనంతరం హైదరాబాద్ కు వచ్చేందుకు అనుమతి లభించింది. కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకునేందుకు వారం రోజుల పాటు హైదరాబాద్‌కు వెళ్లేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. 

కంటికి శస్త్రచికిత్స తర్వాత రావు ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత, రెండో కంటికి శస్త్రచికిత్స కోసం తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఏఎస్ గడ్కరీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆయన 2018లో అరెస్టయ్యాడు. 

వైద్య కారణాలతో 2021 మార్చిలో హైకోర్టు ఆరు నెలల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో సుప్రీంకోర్టు 2022 ఆగస్టులో అతనికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్‌లోని షరతుల్లో ఒకటి, కోర్టు అనుమతి లేకుండా ముంబైలోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కోర్టు అధికార పరిధిని రావు విడిచిపెట్టకూడదు. 

ఈ ఏడాది జూన్‌లో, 82 ఏళ్ల వరవరరావు, శస్త్రచికిత్స కోసం తెలంగాణ రాజధానికి వెళ్లడానికి అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. శుక్లాలు పండడం వల్ల తన చూపు క్షీణిస్తోందని రావు పేర్కొన్నారు. ముంబైలో శస్త్రచికిత్స అనంతర సంరక్షణ ఖరీదైనదని, తెలంగాణలో పెన్షన్ హోల్డర్‌కు ఇది ఉచితం అని ఆయన వాదించారు.

డిసెంబర్ 31, 2017న పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సదస్సులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, మరుసటి రోజు జనవరి 1, 2018న పూణే జిల్లాలోని కోరేగావ్-భీమా వద్ద హింసను ప్రేరేపించారని రావు, ఇతర కార్యకర్తలపై కేసు నమోదు చేయబడింది. ఈ సమ్మేళనానికి మావోయిస్టుల మద్దతు ఉందని పూణె పోలీసులు ప్రకటించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది.