మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలడంపై కుట్ర కేసు!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్‌పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. 
అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అనుమానంతోనే ఫిర్యాదు చేశారు. కాగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక విద్రోహ శక్తులున్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కేసుపై విచారణకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు ఇవ్వడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టిపెట్టనున్నారు.

మరోవంక, మేడిగడ్డ బ్యారేజీని కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు నిచ్చెనల ద్వారా కిందకు దిగి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. సుమారు 2 గంటలకు పైగా అధికారులు పిల్లర్లను పరిశీలించారు. మేడిగడ్డ వంతెన కుంగిన ఘటనపై కేంద్ర జలశక్తి శాఖ ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఈ నిపుణుల కమిటీ మంగళవారం బ్యారేజ్‌ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు కారణాలు, బ్యారేజ్‌ సేఫ్టీ, ప్రస్తుతం జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేస్తుంది. ఈ ఘటనపై సమగ్ర పరిశీలన తర్వాత నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనుంది. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు.

కాగా, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో డ్యామ్ లోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరింది. బ్యారేజ్‌ 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.