మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్రం దర్యాప్తు

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్ర జలశక్తి శాఖ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నియమించింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో నిపుణుల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశం అనంతరం కమిటీ సభ్యులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. 
 
బ్యారేజీ పరిశీలన అనంతరం నివేదిక అందించాలని నిపుణుల కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. అంతకు ముందు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ  కేంద్ర జలశక్తి మంత్రి  గజేంద్ర షెకావత్ కు వ్రాసిన లేఖలో కేంద్ర బృందాన్ని పంపమని కోరారు.  
 
ప్రాజెక్టు నిర్మాణానికి ముందు బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని, భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులను గమనించారా? వంటి అంశాలను బృందం పరిశీలించాలని ఆయన సూచించారు. 
 
 పిల్లర్ల  కింద వేసిన ఫౌండేషన్ (పియర్స్) నాణ్యతతో నిర్మించలేదని స్పష్టమైంది. దీన్ని బట్టి పియర్స్ నిర్మించే సమయంలో అక్కడ సాయిల్ ట్రీట్మెంట్ జరగలేదనేది అర్థమవుతోంది. అంటే ఫౌండేషన్ ఇన్స్‌పెక్షన్ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టమైందని కిషన్ రెడ్డి ఆ లేఖలో తెలిపారు.
ప్రాజెక్టు డిజైనింగ్ బాధ్యతను ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ & కన్‌స్ట్రక్షన్) పద్దతిలో ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కంపెనీ చేసిందా?  లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన సిడిఓ (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) ద్వారా చేయించారా? అనే విషయం కూడా పరిశీలించాలని కోరారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు శనివారం కొంతమేరకు కుంగిపోయాయి. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన భారీ శబ్దంతో కుంగింది. దీంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని ఖాళీ చేస్తున్నారు. 
 
కాగా, పియర్‌ కుంగుబాటుకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్యారేజీ డిజైన్‌ చేసి ఇచ్చారని, దీనిని తమ  సంస్థ నిర్మించిందని ఎల్ అండ్ టీ తెలిపింది. వరద నీరు విడుదల సామర్థ్యం 28.25 లక్షలకు అనుగుణంగా డ్యామ్ నిర్మించామని పేర్కొంటూ బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం లేదని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
 
కాగా, ప్రాజెక్టు నిర్మాణం మొత్తం లోపభూయిష్టంగా ఉందని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. పొరపాట్ల వల్లే మేడిగడ్డ బ్యారేజీకి ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ వేల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? అని ఈటల ప్రశ్నించారు.
 
సీఎం కేసీఆర్ కుటుంబమే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.