ప్రకంపనలు సృష్టిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు

కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ కుంగిపోవడం ఎన్నికల సమయంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిర్మాణ నాణ్యత  పలు సందర్భాల్లో  అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండటం, కేసీఆర్ ప్రభుత్వ అవినీతికి ఏటీఎం వంటిది ఈ ప్రాజెక్ట్ అను ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండటంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బ్యారేజీ మూడో బ్లాక్లోని పిల్లర్లు శనివారం రాత్రి కుంగిపోయాయి. దాదాపు 85 గేట్లు, 16 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజీని నిర్మించగా 19, 20, 21 నెంబర్ పిల్లర్లు కుంగిపోయి గేట్ల నుంచి భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది అలర్ట్అయి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బ్యారేజీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపేశారు. 

శనివారం రాత్రి వరకు బ్యారేజీలో దాదాపు 10 టీఎంసీల నీళ్లు ఉండగా, ఇరిగేషన్ అధికారులు అక్కడకు చేరుకుని గేట్లను ఎత్తి నీటికి ఖాళీ చేయడం ప్రారంభించారు. కాగా ఆదివారం ఉదయం ఇంజినీరింగ్ అధికారులు  కుంగుతున్న బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. 

నిర్మాణ లోపమా? మరేదైనా కారణమా? అని విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను వివరిస్తూ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. మేడిగడ్డ ప్రమాదంపై అధికారికంగా స్పందించని అధికారులు వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు.  బ్యారేజీ వద్దకు మీడియా, ప్రతిపక్ష నాయకులు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటువైపుగా ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టంగా ఐరన్ గేట్ అమర్చారు. మీడియా, ప్రతిపక్షాలను అనుమతించకపోవడంతో బ్యారేజీ భద్రత విషయంలో అనుమానాలు బలపడుతున్నాయి.

 కాగా విషయం తెలుసుకున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నాయకులతో కలిసి బ్యారేజ్ సందర్శనకు వచ్చారు. దీంతో ఆయనను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఎట్టకేలకు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును బ్యారేజీ సందర్శనకు అనుమతించారు. 

ఇదిలా ఉంటే లక్ష్మీ బ్యారేజ్ సందర్శనకు ఆదివారం సాయంత్రం బయలుదేరిన బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలతో పాటు ప్రజలకు నీళ్లు ఎలా ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ బ్యారేజీ సంబంధించి మొత్తం పంపులు మునిగిపోయాయి. ఇప్పుడు బ్యారేజ్ కుంగిపోవడంతో మళ్ళీ సమాచారం లేకుండా గేట్లు తెరవడం వల్ల బర్లు గొర్లు, పొలాలు కొట్టుకుపోయాయి. ఈ విపత్తు చిన్న విపత్తు కాదు. ఒకటే పిల్లర్ 5 అడుగులు కుంగింది అంటున్నారు. 15 నెంబర్ నుంచి 22 పిల్లర్ వరకు కొన్ని వందల టన్నుల కాంక్రీట్ తో నిర్మించినవి కుంగినవి. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

కాగా, మొత్తం ఈ ప్రాజెక్ట్ భద్రతపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రాష్త్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీని పిలిపించి, ప్రాజెక్టును పరిశీలించే విధంగా చర్యలు చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తి ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా దీనిని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రారంభించిన మూడేండ్లలోనే ఈ ప్రాజెక్టులో కొంతభాగం కుంగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.