ఎన్నికల కోడ్ సాకుతో బతుకమ్మ పండుగ పట్ల వివక్ష

 
ఎన్నికల కోడ్ నెపంతో  బతుకమ్మ పండుకకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా తెలంగాణాలో ప్రభుత్వ అధికారులు వివక్ష చూపుతున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి చేసిన ఫిర్యాదులో ఆ విధంగా  హిందువుల పండుగ పట్ల వివక్ష చూపిన అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేసింది.
జిహెచ్ఎంసి లో అధికారులు రజాకార్ కోడ్ అమలు చేస్తున్నారని మండిపడింది. ఈ విషయంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్ల గురించి అధికారులకు సరైన ఆదేశాలు జారీ చేయాలని  ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు.  ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ  ప్రజలు జరుపుకునే పండుగలకు ప్రభుత్వం చేయాల్సిన పనులు యధావిధిగా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈరోజు జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల అధికారులకు ఏర్పాట్లపై ఆదేశాలు చేస్తామని పరిషత్ ప్రతినిధి బృందానికి తెలిపారు. సీఈఓను కలిసిన అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ కలిసేందుకు వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో అదనపు కమీషనర్ ను కలిశారు. 
 
 ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ ఎందుకు బతుకమ్మ ఏర్పాట్లు చేయడం లేదని నిలదీశారు. ఎన్నికల కోడ్ పేరుతో రజాకార్ కోడ్ అమలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.  ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్పరెన్స్ జరుగుతున్న సమావేశ మందిరం ముందు అధికారులను లోనికి వెళ్ళకుండా అడ్డుకొని స్పష్టమైన హామి ఇచ్చేవరకూ ఇక్కడే బైఠాయిస్తామని స్పష్టం చేశారు. 
 
దానితో వెంటనే ఈరోజు అధికారులందరికి తగు ఆదేశాలు ఇచ్చి తగు ఏర్పాట్లు చేస్తామని హామీఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ పేరుతో హిందూ పండుగల పట్ల లేని ఆంక్షలు రుద్దుతున్న అధికారులపై ఎన్నికల సంఘం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 

ఇలాంటి హిందూ వ్యతిరేఖ అధికారులు రేపు జరగబోయే ఎన్నికలలో కూడా వివక్ష చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  పరిషత్  రాష్ట్ర కార్యదర్శి పండరీనాధ్, మఠమందిర్ విభాగ్ జాతీయ సంయోజక్ ఎం రామరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. రావినూతల శశిధర్, భజరంగదళ్ రాష్ట్ర సంయోజక్ శివరాములు, అనంతరామ్ తదితరులు ఉన్నారు.