ఇజ్రాయెల్‌లో మసీదుపై వైమానిక దాడి

ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాల్లో నెత్తుటేర్లు పారుతున్నాయి.  ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని మసీదు కింద ఉన్న కాంపౌండ్‌పై ఆదివారం వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఈ ప్రదేశాన్ని హమాస్,  పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ “ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి” ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది.
 
“ఇజ్రాయిల్ దళాలు జెనిన్‌లోని అల్-అన్సార్ మసీదులో హమాస్,  ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదుల స్థావరంపై వైమానిక దాడిని నిర్వహించాయి. పౌరులపై తీవ్రవాద దాడులను ప్లాన్ చేయడానికి,  అమలు చేయడానికి మసీదు నుకమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని ఐడిఎఫ్ నిఘా అధికారులు వెల్లడించారు” అంటూ ఐడిఎఫ్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఒక వంక గాజా స్ట్రిప్‌పై దాడిని తీవ్రతరం చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుండగా, ఐక్యరాజ్యసమితి పంపిన 20 ట్రక్ ల సహాయ సామాగ్రి ప్రవేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వాగతించారు. రఫా సరిహద్దును దాటుకొని గాజాలోకి మరింత సహాయ సామాగ్రి ప్రవేశించేందుకు  వాషింగ్టన్ కట్టుబడి ఉందని చెప్పారు.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరం నెలకొన్న అల్-అన్సార్ మసీదులో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ఈ ఫోటోలు మసీదు కింద ఉన్న బంకర్‌లోకి ప్రవేశ ద్వారం చూపిస్తున్నాయి.
 
ఉగ్రవాదులు అక్కడ ఆయుధాలను ఎక్కడ నిల్వ ఉంచారో చూపిస్తూ ఒక రేఖాచిత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ దాడిలో కనీసం ఒక పాలస్తీనియన్ మరణించాడని, మరో ముగ్గురు గాయపడ్డారని పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. పాలస్తీనా అధికారుల ప్రకారం, హమాస్ తన ఆకస్మిక దాడిని ప్రారంభించిన అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ దళాలతో జరిగిన ఘర్షణలలో వెస్ట్ బ్యాంక్‌లో కనీసం 84 మంది పాలస్తీనియన్లు మరణించారు.
 

ఈ దాడులలో ఇప్పటి వరకు 4,385 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ (పిఆర్‌సిఎస్‌) డైరెక్టర్‌ మార్వాన్‌ జిలానీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, గాజాలో మరణించిన వారి సంఖ్య 4,137కు చేరుకుంది, వీరిలో 70 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో వెయ్యి మంది గల్లంతయ్యారు  లేదా శిథిలాల కింద చిక్కుకున్నారు.

 
మరోవంక, ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ మానవతా సంస్థలే లక్ష్యంగా నెతన్యాహు ప్రభుత్వం వైమానిక దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. గత 24 గంటల్లో వైమానిక దాడుల్లో ఇద్దరు ఐక్యరాజ్యసమితి రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) సిబ్బంది హత్యకు గురయ్యారు. 
 
వైమానిక దాడుల్లో 16 మందికిపై ఐరాస సిబ్బంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చునని ఐరాస పేర్కొంది. ఐరాస సంస్థలపై ఇప్పటివరకూ ఇజ్రాయిల్‌ 33 వైమానిక దాడులకు పాల్పడింది. గాజాలో 14 లక్షల మంది శరణార్థులు ఉన్నారని ఐరాస అంచనా వేసింది. వారిలో ఐదు లక్షల మంది వరకూ ఐరాస ఏర్పాటు చేసిన అత్యవసర శిబిరాల్లో తలదాచుకున్నారు.

గాజాలోని హౌసింగ్‌ మంత్రిత్వ శాఖ, ఐరాస తెలిపిన వివరాల ప్రకారం, గాజా స్ట్రిప్‌లోని 30 శాతం నివాసాలు గత రెండు వారాల్లో ధ్వంసమయ్యాయి. వేల మంది తమ నివాసాలను కోల్పోయారు. ”బీట్‌ హనౌన్‌, బీట్‌ లాహియా, షుజారు, అబ్బాసన్‌ కబీరాతో సహా చాలా ప్రాంతాలు నాశనం చేయబడ్డాయి” అని ఐరాస పేర్కొంది.